ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమానికి ఊపిరులూదింది సింగరేణి అని,ఇది తెలంగాణకు ఆయువుపట్టు వంటిదని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు.అందుకే సింగరేణి సంస్థ,ఇందులోని కార్మికులు అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక గౌరవాభిమానాలు ఉన్నాయన్నారు.దీనిని ప్రైవేటుపరం చేయాలనే కేంద్ర ప్రభుత్వం కుట్రల్ని కార్మికుల సంపూర్ణ తోడ్పాటుతో బీఆర్ఎస్, కేసీఆర్ అడ్డుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర గుర్తు చేశారు.కొత్తగూడెంలోని తెలంగాణ బొగ్గు గని కార్మిక కార్పోరేట్ కార్యాలయంలో శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎంపీ వద్దిరాజు స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ,కార్మిక సంఘం ప్రముఖ నాయకుడు వెంకట్రావులతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ, తీవ్ర నష్టాలలో కొట్టుమిట్టాడుతున్న ఈ సంస్థను లాభాల బాటలోకి తెచ్చి కార్మికులు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమానికి చిత్తశుద్ధితో పాటుపడుతున్న కేసీఆర్ కు కొండంత అండగా నిలవాల్సిందిగా ఎంపీ రవిచంద్ర విజ్ఞప్తి చేశారు.ఈనెల ఐదవ తేదీన జరిగే బీఆర్ఎస్ “ప్రజా ఆశీర్వాద సభ”కు కుటుంబ సభ్యులు,బంధుమిత్రులతో కలిసి తరలివచ్చి విజయవంతం చేయాల్సిందిగా ఎంపీ వద్దిరాజు కార్మికులకు విజ్ఞప్తి చేశారు.