- Advertisement -
చెల్లి ఫోటో… అక్కచీటింగ్…
Sister Photo... Sister Cheating...
కర్నూలు, నవంబర్ 20, (వాయిస్ టుడే)
చెల్లెలు ఫోటోతో ఓ అబ్బాయికి పరిచయమైంది ఆ యువతి. అది కూడా సోషల్ మీడియా ద్వారా మాటలు కలిపి, ఏకంగా ఒక కోటి 20 లక్షలు మోసం చేసిందట. చివరకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, వైద్యశాలలో చికిత్స పొందుతోంది ఆ యువతి. ఈ ఘటన కర్నూలు జిల్లా పత్తికొండలో జరగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.కర్నూలు జిల్లా పత్తికొండ మండలం చక్రాల గ్రామానికి చెందిన ఓ యువతి, తెలంగాణ పటాన్ చెరువు మండలం ముత్తంగి కి చెందిన యువకుడికి ఫేస్ బుక్ ద్వారా పరిచయమైంది. యువకుడు హైదరాబాద్ లోని ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా, వీరి పరిచయం ఏళ్ల తరబడి కొనసాగింది.అయితే సదరు యువతిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న యువకుడు, పెళ్లి మాట ఎత్తగానే యువతి ఏదో ఒక కారణం చెబుతూ దాటవేసేదట. పలుమార్లు ఆర్థికంగా సహాయపడేందుకు డబ్బులు అందజేసిన యువకుడు, మొత్తం కోటి 20 లక్షలు అందజేసినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.చివరకు తాను మోసపోయానని గ్రహించిన యువకుడు పెద్దల సమక్షంలో పంచాయతీ చేయగా, రూ.10 లక్షలు వెనక్కి ఇచ్చినట్లు సమాచారం. ఇక మిగిలిన డబ్బులను యువకుడు పదేపదే అడుగుతుండగా, డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించిన నేపథ్యంలో పత్తికొండ పోలీసులను యువకుడు ఆశ్రయించాడు.చెల్లెలు ఫోటో సోషల్ మీడియా ముఖచిత్రంగా ఏర్పాటు చేసుకొని తనను సదరు యువతి మోసగించిందని, ఆర్థికంగా డబ్బు సహాయం అడిగిన సమయంలో తాను కోటి 20 లక్షల వరకు అందించినట్లు తెలిపాడు. అయితే పదేపదే డబ్బులు అడిగిన సందర్భంలో యువతి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి ఏకంగా మత్తు గులిగలు మింగి అన్నంత పని చేసింది. దీనితో కుటుంబ సభ్యులు అప్రమత్తమై వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.ఓ వైపు తనకు న్యాయం చేయాలని యువకుడు, మరోవైపు ప్రాణాప్రాయ స్థితిలో ఆ యువతి ఉండగా, పెద్దలు మరోమారు ఈ విషయంలో జోక్యం చేసుకోనున్నట్లు తెలుస్తోంది
- Advertisement -