ఆరు బెర్తులు..12 మంది ఆశవహులు
Six berths..12 aspirants
హైదరాబాద్, అక్టోబరు7
తెలంగాణ కాంగ్రెస్ లో పదవుల ఆశలు చిగురిస్తున్నాయి. పలు సార్లు వాయిదా పడుతూ వస్తున్న మంత్రివర్గ విస్తరణపై మళ్లీ ఊహాగానాలు జోరందుకున్నాయి. దసరాకు అటు ఇటుగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఢిల్లీ పర్యటన నేపథ్యంలో పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. మంత్రివర్గ విస్తరణతో పాటు ఇతర నామినేటెడ్ పదవుల చర్చ నేపథ్యంలో ఎవరెవరికి ఛాన్స్ రానుందనే చర్చ పార్టీలో నడుస్తోంది ఢిల్లీలో పర్యటనలో కేబినెట్ విస్తరణకు పార్టీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉంది. జమ్ముకశ్మీర్ ఎన్నికల ప్రక్రియ కూడా పూర్తి కావడంతో.. క్యాబినెట్ అంశంపై డిస్కస్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం క్యాబినెట్ లో 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఆ ఆరు స్థానాల కోసం దాదాపు డజనుకు పైగా నేతలు పోటీపడుతున్నారు.వీటిలో ప్రధానంగా క్యాబినెట్ లో స్థానం దక్కని ఉమ్మడి జిల్లాలు, సామాజిక సమీకరణాలు బేరీజు వేసుకుని భర్తీ చేసే ఛాన్స్ ఉంది. ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. ఈసారి మంత్రివర్గ విస్తరణలో ఈ జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇద్దరు నేతలు తీవ్రంగా పోటీపడుతున్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ ల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ప్రేమ్ సాగర్ రావుకు భట్టి విక్రమార్క సపోర్ట్ గా ఉంటే.. వివేక్ కు అధిష్టానం హామీ ఇచ్చిందని సీఎం రేవంత్ మద్దతుగా నిలుస్తున్నారు.ఇక, ఉమ్మడి కరీంనగర్ నుంచి ఇప్పటికే క్యాబినెట్ లో శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఉన్నప్పటికీ.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పోటీ పడుతున్నారు. తెలంగాణలో మున్నూరు కాపు బలమైన సామాజికవర్గం కాబట్టి.. అదే సామాజికవర్గానికి చెందిన ఆది శ్రీనివాస్ పోటీలో ఉన్నారు. క్యాబినెట్ లో అవకాశం లేని మరో జిల్లా నిజామాబాద్ నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావ్ మధ్య పోటీ నెలకొంది. మరోవైపు ఉమ్మడి నల్గొండ నుంచి క్యాబినెట్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు ఉన్నారు. తాజాగా అదే జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ రేసులో ఉన్నారు.రాజగోపాల్ రెడ్డికి పార్టీ అధిష్టానం హామీ ఇచ్చిందని టాక్ నడుస్తోంది. క్యాబినెట్ లో యాదవ, కురుబ సామాజికవర్గం నుంచి ఎవరూ లేకపోవడంతో తనకు ప్రమోషన్ ఇవ్వాలని విప్ బీర్ల ఐలయ్య పట్టుబడుతున్నారు. క్యాబినెట్ లో లంబాడ సామాజికవర్గం నుంచి ఎవరూ లేకపోవడంతో తనకు అవకాశం ఇవ్వాలని బాలూ నాయక్ కోరుతున్నారు. ఇక ముదిరాజ్ సామాజికవర్గం నుంచి ఒకరికి ఛాన్స్ ఇస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ ప్రకటించిన నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్ ఆశలు పెంచుకున్నారు. ముదిరాజ్ సామాజికవర్గానికే చెందిన ఉమ్మడి మెదక్ జిల్లా నేత నీలం మధు ముదిరాజ్ కు అవకాశం ఇవ్వాలని పార్టీ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ పట్టుబడుతున్నారు. అలాగే, ఉమ్మడి మెదక్ జిల్లాకే చెందిన మైనంపల్లి రోహిత్ రావు కూడా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. మైనార్టీ వర్గం నుంచి ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ సైతం రేసులో ఉన్నారు.ఇలా మొత్తం మీద ఉన్న ఆరు స్థానాల కోసం డజను మంది నేతలు పోటీ పడుతున్నారు. పోటీ తీవ్రంగా ఉండటంతో క్యాబినెట్ విస్తరణ ఇన్నాళ్లూ వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు హర్యానా, జమ్ముకశ్మీర్ ఎన్నికలు పూర్తి కావడంతో అధిష్టానం తెలంగాణ క్యాబినెట్ విస్తరణపై దృష్టి సారించనుంది. పార్టీకి నష్టం కలగకుండా అన్ని సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని.. క్యాబినెట్ కూర్పు చేసే ఛాన్స్ ఉంది. కేబినెట్ లో ఛాన్స్ దక్కని వారికి ఇతర నామినేటెడ్ పదవులు ఇచ్చే అవకాశం ఉంది.