Sunday, December 15, 2024

అంత సిద్ధం

- Advertisement -

నామినేషన్ల పర్వం ప్రారంభం

మెజారిటీ అభ్యర్థులను ప్రకటించిన ప్రధాన పార్టీలు

హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభ ఎన్నికల పోరులో కీలక అంకానికి శుక్రవారం తెర లేస్తోంది. నామినేషన్ల పర్వం ప్రారంభమవుతోంది. ఇప్పటికే రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపిక, ప్రచారాన్ని ప్రారంభించాయి. ఇక నామినేషన్ల ప్రక్రియకూ శ్రీకారం చుట్టనున్నాయి. ఇది పదో తేదీ వరకు కొనసాగనుంది. ఇప్పటికే ప్రధాన పార్టీల టికెట్‌ ఖరారైన అభ్యర్థులతో పాటు ఆశావహులు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ముహూర్తాల మీద నమ్మకాలున్న వారు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. శుక్రవారంతో పాటు ఈ నెల 4, 7, 8, 9, 10 తేదీలలో భారీగా దాఖలయ్యే అవకాశం ఉంది. తెలంగాణ మూడో శాసనసభ ఎన్నికల్లో 3.17 కోట్ల మంది ఓటర్లు 119 మంది  ఎమ్మెల్యేలను ఎన్నుకోనున్నారు. 117 స్థానాలకు భారాస… 100 స్థానాలకు కాంగ్రెస్‌.. 88 స్థానాలకు భాజపా అభ్యర్థులను ప్రకటించాయి.

భారాస…

ముందుగా అభ్యర్థులను ప్రకటించిన భారాస మిగిలిన పార్టీల కంటే ప్రచారంలో ముందుంది. ఏడుగురు మినహా మిగిలిన సిట్టింగ్‌ ఎమ్మెల్యేలందరికీ తిరిగి టికెట్లు ఇచ్చింది. ఎమ్మెల్యేలకు సీట్లు నిరాకరించిన చోట, సిట్టింగులకు మళ్లీ టికెట్లు ఇచ్చిన కొన్ని నియోజకవర్గాల్లో ఎదురైనే అసంతృప్తులను చల్లార్చడంతోపాటు ఇతర పార్టీల్లోని అసమ్మతి నాయకులను చేర్చుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చింది. ఇదే సమయంలో ఇద్దరు ఎమ్మెల్సీలు, కొందరు భారాస నాయకులు పార్టీని వీడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ గత నెల 15 నుంచి ప్రచారం ప్రారంభించారు. విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి కూడా పోటీ చేయనున్న కేసీఆర్‌ ఈ నెల తొమ్మిదిన రెండు చోట్లా నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. మరోవైపు మంత్రులు కేటీ రామారావు, హరీశ్‌రావులు సభలు, నియోజకవర్గ స్థాయి సమావేశాలు, బూత్‌ స్థాయి సమావేశాల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు. సుమారు 60 నియోజకవర్గాల్లో ఇప్పటికే ప్రచారం చేశారు. అభ్యర్థులను ముందుగానే ప్రకటించడంతో వారు అందరూ నియోజకవర్గాలను ఒకసారి చుట్టేశారు.

కాంగ్రెస్‌…

కాంగ్రెస్‌.. మిగిలిన 19 స్థానాలకు కూడా నేడో రేపో అభ్యర్థులను ప్రకటించనుంది. తమకే సీటు వస్తుందనుకొన్న నాయకులు ముందు నుంచీ నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో కొత్తగా వచ్చిన వారికి అవకాశం ఇవ్వడంతో వారూ ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి కొందరు రాగా, పార్టీ నుంచి ఇంకొందరు బయటకు వెళ్లారు. సీడబ్ల్యూసీ సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహించడం, ఈ సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో తెలంగాణలో అధికారంలోకి వస్తే అమలు చేసే ఆరు గ్యారంటీలను ప్రకటించడం ద్వారా పార్టీ.. ప్రచారానికి ఊపు తెచ్చింది. తర్వాత పార్టీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక బస్సు యాత్రను ప్రారంభించారు. రాహుల్‌గాంధీ మూడు రోజులు ఇందులో పాల్గొన్నారు. తాజాగా మరో మూడు రోజులు ప్రచారం నిర్వహించారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లు కూడా రాష్ట్రానికి వచ్చారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఇతర నాయకులు కూడా పలు సభల్లో పాల్గొన్నారు. రాహుల్‌గాంధీ ప్రచారంలో పాల్గొనడంతో కాంగ్రెస్‌ ప్రచారానికి ఊపొచ్చింది.

భాజపా…

భాజపా మరో 31 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. జనసేనతో కలిసి పోటీ చేయాలని నిర్ణయించినందున ఈ పార్టీకి కేటాయించే స్థానాలు పోనూ మిగిలిన చోట్ల అభ్యర్థులను ప్రకటించాలి. షెడ్యూలు ప్రకటించకముందే ప్రధానమంత్రి మోదీ రెండు బహిరంగసభల్లో పాల్గొనగా, అమిత్‌ షా, కొందరు కేంద్రమంత్రులు పలు సభలకు హాజరయ్యారు. అభ్యర్థుల ఎంపికలో జాప్యంతోపాటు, పలువురు నాయకులు పార్టీని వీడటం భాజపాను ఆందోళనకు గురి చేసింది. ముగ్గురు ఎంపీలను అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దింపిన భాజపా, బీసీ సీఎం నినాదంతో ముందుకెళ్తోంది.

మజ్లిస్‌…

మజ్లిస్‌ పార్టీ ఇప్పటి వరకు అభ్యర్థుల జాబితాను ప్రకటించలేదు. పలు స్థానాల్లో సిట్టింగుల మార్పిడి, కొత్త వారికి అవకాశంపై ఆ పార్టీ  కసరత్తు చేస్తోంది. ఒకటి, రెండురోజుల్లో ఆ ప్రక్రియను పూర్తి చేయనున్నట్టు తెలుస్తోంది.

వామపక్షాలు…

కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేయాలని వామపక్షాలు భావించగా, సీట్ల విషయంలో కాంగ్రెస్‌ స్పష్టత ఇవ్వకపోవడంతో ఒంటరిగానే పోటీ చేయాలని సీపీఎం నిర్ణయించింది. పోటీ చేసే 17 స్థానాలను ప్రకటించింది. సీపీఐ ఒకటి రెండు రోజులు ఎదురుచూసే అవకాశం ఉంది.

బీఎస్పీ…

బీఎస్పీ ఇప్పటికే సగం స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ సిర్పూర్‌ నుంచి బరిలోకి దిగుతున్నారు. ప్రవీణ్‌కుమారే రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారంలో పాల్గొంటున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్