వరంగల్, అక్టోబరు 12: పితృ అమావాస్య సందర్భంగా.. అత్తింటివారు పిలిచారని భోజనానికి వెళ్లిన అల్లుడు కత్తిపోట్లకు గురయ్యాడు. విషమ పరిస్థితిలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. జగిత్యాల జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. ధరూర్ క్యాంపుకి చెందిన గజ్జల సాయికుమార్ (24) అనే యువకుడికి.. ఇందిరా నగర్‌కు చెందిన పావనికి మూడేళ్ల క్రితం పెళ్లయ్యింది. గత కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో పితృ అమావాస్య సందర్భంగా భోజనానికి రావాలని అత్తింటి వారు సాయికుమార్‌ను పిలిచారు. కానీ అత్తారింటికి వెళ్లిన ఆ యువకుడు కత్తిపోట్ల బారిన పడ్డాడు. ‘మా అమ్మాయి మీ అబ్బాయితో రానని చెప్పింది. దీంతో మద్యం తాగొచ్చి మీ వాడు గొడవ చేస్తున్నాడు’ అని అత్తింటి వారు సాయికుమార్ సోదరికి ఫోన్ చేసి చెప్పారు. తాము ఫోన్లో మాట్లాడుతుండగానే.. సాయి కుమార్ బామ్మర్ది వంశీ, ఇతరులు మా తమ్ముడిపై దాడి చేశారని సాయి కుమార్ సోదరి ఆరోపిస్తున్నారు.తీవ్రంగా గాయపడిన సాయి కుమార్‌ను అతడి సోదరుడు ఆటోలో జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స అందిస్తున్నారు. తాగిన మైకంలో సాయి కుమార్ తనను తాను పొడుచుకున్నాడని అత్తింటి వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఎవరో తనపై దాడి చేసి కత్తితో పొడిచారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఈ ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.‘గాయపడింది మా తమ్ముడు గజ్జల సాయి కుమార్. ఏదో పండుగ ఉందని భార్యాభర్తలిద్దరూ కలిసి అత్తారింటికి వెళ్లారు. సాయంత్రంలోగా వద్దని తను చెప్పింది. కానీ చివర్లో తాను రానని చెప్పడంతో.. ఇప్పటికి రెండు నెలలు ఇక్కడే ఉన్నావు కదా.. ఎందుకు రావని అడిగాడు. అందరూ కూడా రాదని చెప్పారు. అప్పుడు ఏ గొడవైందో ఏమైందో తెలీదు గానీ.. మీ తమ్ముడు తాగి గొడవ పడుతున్నాడని ఫోన్ చేసి చెప్పారు. మీ తమ్ముడు పొడుచుకున్నాడని చెప్పారు. మా తమ్ముణ్ని అడిగితే ఎవరు పొడిచారో తెలియడం లేదు అక్కా అంటున్నాడు. మా అన్న, మా ఆయన కలిసి వెళ్లి ఆటోలో తీసుకొచ్చారు’ అని సాయి కుమార్ సోదరి తెలిపారు.