కేటీఆర్ స్థానాన్ని భర్తీ చేస్తున్న శ్రీధర్ బాబు
హైదరాబాద్, జనవరి 31
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హైదరాబాద్ అల్లకల్లోలం అవుతుంది. పరిశ్రమలు రావు. ఐటీ కంపెనీలు బెంగళూరు తరలిపోతాయి. అల్లర్లు, గొడవలు పెరుగతాయి.. బీఆర్‌ఎస్ ఉంటేనే ఉద్యోగులకు, సెటిలర్లకు రక్ష.. ఇదీ ఎన్నికల సమయంలో అప్పటి ముఖ్యమైన మంత్రి, ఐటీ శాఖ మాత్యులుగా ఉన్న కల్వకుంట్ల తారకరామారావు చేసిన ప్రచారం. ఐటీకి తానే ఓ బ్రాండ్ అంబాసిడర్ అన్నట్లుగా ప్రచారం చేసుకున్న కేటీఆర్‌ను అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ఐటీ ఉద్యోగులు మర్చిపోయేలా చేశారు.. ప్రస్తుత ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు. డిసెంబర్ 7న మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారిలో ఉన్నత విద్యావంతుడు అయిన శ్రీధర్‌బాబుకు సీఎం రేవంత్‌రెడ్డి కీలకమైన ఐటీ, పరిశ్రమల శాఖను కేటాయించారు. గతంలో రెండుపర్యాయాలు మంత్రిగా పనిచేసిన శ్రీధర్‌బాబు.. వివాద రహితుడు. సాఫ్ట్‌గా పనిచేసుకోపోతారన్న గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం కొలువు దీరిన నెల రోజులకే దావోస్‌లో నిర్వహించిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు వెళ్లిన సీఎం రేవంత్ తన వెంట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతోపాటు అధికారులను తీసుకువెళ్లారు. అక్కడ పది రోజులపాటు ఉన్న సీఎం, మంత్రి.. దాదాపు 60కిపైగా కంపెనీల ప్రతినిధులను కలిశారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. కొన్ని కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు.తెలంగాణ ఐటీ మంత్రి అంటే కేటీఆర్ అన్న గుర్తింపును రీప్లేస్ చేసేలా దావోస్ వెళ్లిన సీఎం రేవంత్, ఐటీ మంత్రి శ్రీధర్‌బాబుపై బీఆర్‌ఎస్ నాయకులు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు. కానీ వాటిని సీఎం, మంత్రి పెద్దగా పట్టించుకోలేదు. తాము వచ్చిన పనిపైనే దృష్టిపెట్టారు. ఈ క్రమంలో రాష్ట్రానికి రికార్డు స్థాయిలో పెట్టుబడులు తెచ్చే ఒప్పందాలు చేసుకున్నారు. 2024లో రూ.40 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. ఇక ఐటీ శాఖ మంత్రిగా దాదాపు పదేళ్లు ఉన్న కేటీఆర్, ఐటీకి తానే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకునే తారక రామారావును మించి పెట్టుబడులు తెచ్చారు. ఐటీ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ గరిష్టంగా 2023లో 20 వేల కోట్ల పెట్టుబడులకు మాత్రమే ఒప్పందాలు చేసుకున్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నెల రోజులకే శ్రీధర్‌బాబు తెలంగాణకు రూ.40 వేల కోట్ల పెట్టుబడులను తీసుకురాగలిగారు. జెడ్డాలో జరిగిన పలు సమావేశాల్లో ఒక దిగ్గజ ఫుడ్ కంపెనీతో కూడా సంప్రదింపులు జరిపారు. తెలంగాణలో భారీస్థాయిలో రెస్టారెంట్లు ఏర్పాటు చేసేందుకు సదరు కంపెనీ సుముఖత వ్యక్తం చేసింది.తెలంగాణలో పారిశ్రామిక రంగం అభివృద్ధిపై దావోస్ పర్యటనకు ముందే.. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు సీఐఐ ప్రతినిధులతో చర్చలు జరిపారు. తెలంగాణలో పారిశ్రామిక విస్తరణకు ఉన్న అవకాశాలు, పెట్టుబడులకు ఇవ్వాల్సిన రాయితీలు, వ్యాపార సంస్థలు ప్రభుత్వం నుంచి కోరుకుంటున్న సహకారం గురించి తెలుసుకున్నారు. ఈసమావేశం దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సుకు ఎంతగానో దోహదం చేసింది. ఎనర్జీ, ఐటీ, ఏరోస్పేస్, డిఫెన్స్ తదితర రంగాలకు సంబందించిన పెట్టుబడులను తీసుకురావడంలో కీలకంగా మారాయి.ఇక, శ్రీధర్‌బాబు పెట్టుబడులను ఆకర్షించడానికి మరో కీలక నిర్ణయం ప్రకటించారు. తెలంగాణలో ఇండస్ట్రీయల్ ఫ్రెండ్లీ ప్రభుత్వం వచ్చిందని, పరిశ్రమల అనుమతి, రాయితీల విషయంలో ఉదారంగా ఉంటుందని ప్రకటించారు. ఇది పెట్టుబడిదారులను ఆకర్షించింది. ఈఏడాది వచ్చిన పెట్టుబడులతో దాదాపు 5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు.వచ్చే ఐదేళ్లలో ఇదే తరహాలో తెలంగాణ పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం సహకారం అందిస్తే.. నిరుద్యోగం తగ్గుముఖం పట్టడంతోపాటు కేటీఆర్ బ్రాండ్ చెరిగిపోవడం ఖాయమంటున్నారు వ్యాపార నిఫుణులు. ఐటీ మంత్రిగా రెండు నెలల్లోనే రూ.40 కోట్ల పెట్టుబడులు తీసుకురావడంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.
కేటీఆర్ స్థానాన్ని భర్తీ చేస్తున్న శ్రీధర్ బాబు
- Advertisement -
- Advertisement -