కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ కేసీఆరే
హైదరాబాద్, మే 28
తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ పై తెలంగాణ కాంగ్రెస్ అధికారిక X ఖాతా నుంచి ఒక పోస్ట్ వచ్చింది. ఓటమిని ముందే పసిగట్టిన బీఆర్ఎస్.. గెలుపుకోసం అడ్డదారులు తొక్కిందని ఆ పోస్ట్ లో రాశారు. కల్వకుంట్ల ఫ్యామిలీ.. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఫోన్ ట్యాపింగ్ కథను నడిపిందని, ఇదంతా ఆయన డైరెక్షన్లో పనిచేసిన రాధాకిషన్ రావు ఇచ్చిన వాంగ్మూలంలోనే తేటతెల్లమయిందని ఆ పోస్ట్ లో ఉంది. అంతా కేసీఆర్ కనుసన్నల్లోనే జరిగింది. సొంత పార్టీ నేతల ఫోన్లను కూడా కేసీఆర్ ట్యాపింగ్ చేయించడంపై విమర్శలు వస్తున్నాయి.ప్రతిపక్షాలను కట్టడి చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ వ్యూహాన్ని రచించింది. ఇందుకోసం తమ సామాజిక వర్గానికే చెందిన నమ్మకస్తుడు కావాలని కేసీఆర్ అడగడంతో.. ప్రభాకర్ రావు సూచన మేరకు తననే టాస్క్ ఫోర్స్ డీసీపీగా నియమించారని రాధాకిషన్ రావు వాంగ్మూలంలో తెలిపారు.బీఆర్ఎస్ పై కొద్దిపాటి విమర్శ వచ్చినా కేసీఆర్ చిరాకు పడేవారని, ప్రతిపక్ష నాయకులు, వారి కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని చెప్పేవారని రాధాకిషన్ తెలిపారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన డబ్బు పట్టుకోవడం, బీఆర్ఎస్ అవసరాలకోసం అందుతున్న డబ్బును సజావుగా రవాణా చేయాలని తనను ఆదేశించేవారని తెలిపారు. అలాగే రేవంత్ రెడ్డి సహా.. ప్రతిపక్ష, స్వపక్ష నేతలతో పాటు వివిధ న్యూస్ ఛానళ్ల యజమానులపై కూడా నిఘా ఉంచాలనేవారని చెప్పారు. దానిపై తెలంగాణ కాంగ్రెస్ X లో పోస్ట్ చేయడం సంచలనమైంది. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ కేసీఆరేనంటూ విమర్శించింది.