తెలంగాణలో విచిత్ర వాతావరణం
హైదరాబాద్, ఫిబ్రవరి 26, (న్యూస్ పల్స్)
Strange weather in Telangana
తెలంగాణలో భిన్నమైన వాతావరణం నెలకొంది. ఉదయం పూట చలి, పది గంటల నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. గత కొద్ది రోజుల నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. మరో మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మార్చి నెల వస్తుండటంతో ఎండల తీవ్రత మరింత ఎక్కువవుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో ప్రజలు ఉదయం ఎనిమిది గంటలు దాటితే బయటకు రావడానికి భయపడిపోతున్నారు. సాయంత్రం ఆరు గంటల వరకూ ఉష్ణోగ్రతల తీవ్రత తగ్గడం లేదు.. తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే సాధారణ ఉష్ణోగ్రతలు కంటే రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం 35 నుంచి 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, ప్రధానంగా ఆదిలాబాద్, మంచిర్యాల, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలోనూ ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు.రానున్న కాలంలో ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ఎండల తీవ్రత గతంలో కంటే ఎక్కువగా ఉంటుందన్న అంచనాలు వినపడుతున్నాయి. ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు పాటించాలని, లేకుంటే వడదెబ్బ తగిలే అవకాశముందని కూడా హెచ్చరికలు జారీ అవుతున్నాయి. వృద్ధులు, చిన్నారులు ఎండలకు బయటకు రాకుండా ఉండటమే మంచిదని సూచిస్తున్నారు. విద్యాసంస్థలకు కూడా ఒంటిపూట నిర్వహించాలన్న డిమాండ్ వినిపడుతుంది. పరీక్షల సమయంలో విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు వైద్యులు సూచిస్తున్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు.