సికింద్రాబాద్,అక్టోబర్ 31(వాయిస్ టుడే ప్రతినిధి): విద్యార్థులు తమ లక్ష్యాలను చేరుకునేందుకు నిరంతరం శ్రమించాలని అడోబ్ సీఈవో శంతను నారాయణ్ పిలుపునిచ్చారు. కష్టాలు ఎదురైనా ఆత్మస్థైర్యంతో ముందడుగు వేసినప్పుడే విజయం సాధించవచ్చని చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖి. కార్యక్రమంలో ఆయన మంగళవారం పాల్గొన్నారు. ఓయూ ఈసీఈ విభాగం పూర్వ విద్యార్ధి అయిన శంతను ముందుగా తన విభాగాన్ని సందర్శించి, పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అనంతరం కళాశాల ప్రధాన భవనంలోని అసెంబ్లీ హాల్లో విద్యార్థులతో ముచ్చటిస్తూ, వారు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఇంజినీరింగ్ చదివే రోజుల్లో చదువుతో పాటు క్రీడల్లో కూడా చురుకుగా ఉండేవాడినని చెప్పారు. తాను టెన్నిసు ఇష్టంతో ఆడేవాడినని పేర్కొన్నారు. అమెరికాలో మాస్టర్స్ చదివేందుకు వెళ్లి, ఆ తరువాత అడోబ్ కంపెనీ చేరే వరకు తన ప్రస్థానాన్ని వివరించారు. ఆ కంపెనీలో ఏళ్ల తరబడి తాను ఎలా కొనసాగానే విద్యార్థులకు విశదీకరించారు. విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న రంగాలపై దృష్టి సారించాలని సూచించారు. అనంతరం ఆయనను కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.



