తిరుపతి నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి హరిత
తిరుపతి: ఓటర్ల జాబితాలో ఏమైనా అభ్యంతరాలు, మార్పులు, చేర్పులు ఉంటే త్వరగా తమకు అందించాలని తిరుపతి నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ హరిత రాజకీయ పార్టీల నాయకులతో అన్నారు. మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఎన్నికల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు నుండి ఈ మేరకు దరఖాస్తులు వచ్చాయి, ఎంత వరకు పరిష్కరించారు అనే విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నెల క్రితమే ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల చేయడం జరిగిందన్నారు. జాబితాలో మార్పులు, చేర్పులకు సంబంధించి దరఖాస్తులు ఇవ్వాలని అన్నారు. అభ్యంతరాల దరఖాస్తులు బి.ఎల్. ఓ లకు త్వరగా అందివ్వాలని అన్నారు. వారు వాటిని క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. రాజకీయ పార్టీల నాయకులు బి.ఎల్. ఓ. లకు, ఎన్నికల అధికారులకు సహకరిస్తే అందరూ కలసి పారదర్శకమైన ఓటర్ల జాబితా సిద్ధం చేయవచ్చునని అన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ బి.ఎల్. ఓ.లు, సూపర్ వైజర్లతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ మీకు అందిన అభ్యంతరాల దరఖాస్తులు క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. అందరూ స్వయంగా వెళ్ళి పరిశీలించాలని, తొలగించాల్సి వస్తే ఖచ్చితంగా మరణ ధృవీకరణ పత్రం ఉంటేనే చేయాలని అన్నారు. ఎన్నికల విధులు చాలా జాగ్రత్తగా నిర్వహించాలని అన్నారు. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఈ.డి.టి. జీవన్, ఎన్నికల సిబ్బంది ఉన్నారు.


