28.7 C
New York
Sunday, June 23, 2024

సండే..నాన్ వెజ్ లవర్స్ కు షాక్..

- Advertisement -

సండే..నాన్ వెజ్ లవర్స్ కు షాక్..
హైదరాబాద్, ఏప్రిల్ 18
ఆదివారం వచ్చిందంటే ఇళ్లలో నాన్ వెజ్ వంటల ఘుమఘమలాడుతుంటాయి. ఇక హైదరాబాద్ లో అయితే ఆదివారం చికెన్, మటన్ షాపుల ముందు రద్దీ కనిపిస్తుంది. వారం అంతా డ్యూటీలు, ఇతర పనులతో బిజీ బిజీగా ఉండే నగర వాసులు ఆదివారం… ఓ ముక్క, అలవాటుంటే సాయంత్రం ఓ చుక్క వేసుకుంటారు. దీంతో ముఖ్యంగా ఆదివారం నాన్ వెజ్ విక్రయాలు అధికంగా ఉంటాయి. కానీ హైదరాబాద్ వాసులకు ఓ చిన్న బ్యాడ్ న్యూస్… ఏంటంటే వచ్చే ఆదివారం(ఏప్రిల్ 21)న సిటీలో నాన్ వెజ్ దొరకదు. చికెన్, మటన్, ఇతర నాన్ వెజ్ విక్రయాలు ఉండవు. కారణంగా ఏంటంటే…మహావీర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని కబేళాలతో పాటు అన్ని మాంసం దుకాణాలను వచ్చే ఆదివారం మూసివేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ ఉత్తర్వులు జారీ చేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలతో ఆదివారం మాంసం దుకాణాలు మూతపడనున్నాయి. జైనులకు మహావీర్ జయంతి చాలా ముఖ్యమైన పండుగ.జైనులు జరుపుకునే పండుగలలో మహావీర్ జయంతి చాలా ముఖ్యమైనది. అహింసను ప్రబోధించిన జైన మత ప్రచారకుడు, వర్ధమాన మహావీరుడి జయంతిని ప్రతిసంవత్సరము చైత్ర మాసంలో ఘనంగా జరుపుకుంటారు. 36వ ఏట సన్యాసాన్ని స్వీకరించిన వర్ధమానుడు.. 12 ఏళ్ళ పాటు తపస్సు చేసి మహావీరుడుగా జైనమత ప్రచారకుడయ్యారు. అప్పటికే జైన మతానికి 23 మంది తీర్ధంకరులుగా ఉన్నప్పటికీ మహావీరుడు బాధ్యతలు చేపట్టిన తర్వాతే ఆ మతానికి సంబంధించిన వివరాలు వెలుగు చూసినట్లుగా చెబుతారు. 32 ఏళ్ళ పాటు అహింసా ధర్మంతో మత ప్రచారం జరిపిన మహావీరుడు 72వ ఏట మరణించారు.జన్మదినం సందర్భంగా హైదరాబాద్‌లోని కబేళాలతో పాటు మాంసం దుకాణాలను మూసివేయాలని ఆదేశించినట్లు జీహెచ్ఎంసీ రొనాల్డ్ రాస్ తెలిపారు. హైదరాబాద్ సిటీలో మాంసానికి ఉన్న డిమాండ్ మరే నగరంలోనూ ఉండని సంగతి తెలిసిందే. పెద్ద సంఖ్యలో ఉన్న జనాభాతో పాటు వేలాది సంఖ్యలో ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు కూడా భారీ మొత్తం మాంసం కొనుగోలు చేస్తుంటాయి. ఆదివారం షాపుల మూసివేత కారణంగా వీరికి కాస్త నష్టం ఎక్కువగా ఉండనుంది. కానీ, ఈ ఉత్తర్వుల గురించి తెలిసిన వారు మాత్రం ముందు రోజే తాజా మాంసాన్ని కొనుగోలు చేసుకొని ఫ్రిడ్జ్ లో నిల్వ చేసుకొని ఆదివారాన్ని యథాతథంగా జరుపుకోనున్నారు. తిరిగి సోమవారం యథావిధిగా కబేళాలు తెరుచుకోవచ్చని కమిషనర్ చెప్పారు.హైదరాబాద్ లోనూ జైనుల సంఖ్య గణనీయంగా ఉండడంతో…మహావీర్ జయంతి నాడు నగరంలో మాంసం విక్రయాలపై ఆంక్షలు విధించింది జీహెచ్ఎంసీ. ఈ నిర్ణయానికి ప్రజలు సహకరించాలని కోరింది. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా మాంసం షాపులు ఓపెన్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని జీహెచ్ఎంసీ కమిషనర్ హెచ్చరించారు. జీహెచ్ఎంసీ సిబ్బంది ఈ ఉత్తర్వులను అమలు చేయడంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సోమవారం యథావిధిగా కబేళాలు తెరుచుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!