- Advertisement -
ఎస్సీ వర్గీకరణకు సుప్రీం తీర్పును అమలు చేయాలి
Supreme judgment for SC classification should be implemented
ఎస్సీ వర్గీకరణ కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని మాదిగ మేధావుల ఫోరం డిమాండ్ చేసింది. ఈ ఆగస్టు 1న భారత అత్యున్నత న్యాయస్థానం ఎస్సీ రిజర్వేషన్లు జనాభా దమాషా ప్రకారం వర్గీకరణ చేసుకోవచ్చని తీర్పును ఇచ్చిందన్నారు. ఈ మేరకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఫోరం గౌరవాధ్యక్షులు ప్రొఫెసర్ కాశీం, అధ్యక్షులు డా.ఆరేపల్లి రాజేందర్ లు మాట్లాడుతూ.. సామాజిక న్యాయం సమకూరాలంటే వర్గీకరణ జరగవలసిందేనని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారని, తీర్పుకు అనుకూలంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మద్దతు ప్రకటించారని, అమలుకు కావలసిన చర్యలను వెంటనే ప్రారంభిస్తారని తెలియజేశారని గుర్తు చేశారు. దానికోసం క్యాబినెట్ సబ్ కమిటీతో పాటు ఆ తర్వాత హైకోర్టు రిటైర్డ్ జడ్జితో కమిషన్ కూడా వేశారన్నారు. వెంటనే నివేదికను తీసుకొని వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. గతంలో 2000 సం. నుంచి 2004 వరకు ఉమ్మడి రాష్ట్రంలో వర్గీకరణ అమలైందని, ఎందరో మాదిగ, మాదిగ ఉపకులాలు విద్యా ఉద్యోగ రంగాల్లో ప్రయోజనం పొందారని అన్నారు. సామాజిక న్యాయం ఆ కాలంలోనే నెరవేరిందని, రాజ్యాంగంలో 341 ఆర్టికల్ వర్గీకరణకు వ్యతిరేకం కాదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. వర్గీకరణ వలన అందరికీ సామాజిక న్యాయం జరుగుతుందని మేధావులు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు తమ సంపూర్ణ మద్దతును తెలిపాయన్నారు. కనుక మాల మిత్రులు కూడా దీనిని వ్యతిరేకిస్తూ సభలు పెట్టకుండా కలిసి రావాలని పిలుపునిచ్చారు. దళితుల మధ్య ఐక్యత రావాలంటే వర్గీకరణ జరగాలన్నారు…..
- Advertisement -