స్వరూపానందకు వారం రోజులు గడువు
విశాఖపట్టణం, మార్చి 26, (వాయిస్ టుడే)
Swaroopananda gets one week's notice
విశాఖ శ్రీ శారదా పీఠం వ్యవహారం ఎంతవరకు వచ్చింది? కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత స్వరూపానంద స్వామి కనిపించడం మానేశారా? స్వామి కబ్జాల వ్యవహారం బయటకు వస్తోందా? బయటకు రావడం కంటే సైలెంట్‌గా ఉండడమే బెటరని అంచనాకు వచ్చారా? మరి జీవీఎంసీ నోటీసులకు స్పందన లేకుంటే కూల్చివేతలు ఖాయమా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.వైసీపీ రూలింగ్‌లో రాజభోగం అనుభవించిన వారిలో శ్రీ శారదా పీఠం స్వరూపానంద స్వామి ఒకరు. భక్తుల మాట కాసేపు పక్కనబెడితే ఆయన ఆశీర్వాదం కోసం రాజకీయ నేతలు, అధికారులు తెగ తిరిగేవారు. అయినా స్వామి జగన్, కొందరు మంత్రులకు మాత్రమే కనిపించేవారు. ఆ తర్వాత ప్రత్యేకంగా కొందరితో మాత్రమే మాట్లాడేవారు.వైసీపీ పాలనలో వందల కోట్ల రూపాయల విలువ చేసే భూములను ఆక్రమించుకున్నారని స్వామిపై ఆరోపణలు లేకపోలేదు. దీనికితోడు స్వామికి ప్రత్యేకంగా భద్రత సైతం ఏర్పాటు చేసింది. కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు బాగా పరిపాలన చేస్తారంటూ రెండు ముక్కలు మాట్లాడారు. ధనుర్మాసం పూజలంటూ బయటకు వెళ్తానన్నారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో సెటిలవుతానని చెప్పుకొచ్చారు.చివరకు స్వామి పత్తా లేకుండా పోయారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలీదు. స్వామి కోసం చాలామంది భక్తులు ఎదురు చూస్తున్నారు. స్వామి ఆశీర్వాదం తీసుకుంటే మంచి జరుగుతుందని కొందరు నమ్ముతారు. కూటమి వచ్చాక ఆయన భద్రతను పూర్తిగా తొలగించింది. ఇప్పుడు స్వామి కూడబెట్టిన ఆస్తులపై దృష్టిపెట్టింది.తాజాగా విశాఖ శ్రీ శారదా పీఠానికి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ జోనల్ కమిషనర్ నోటీసులు ఇచ్చారు. రెవెన్యూ అధికారుల సర్వేలో 22 సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించినట్లు గుర్తించారు. అందులో శాశ్వత కట్టడాలు నిర్మించారు. వాటిని వారంలోగా తొలగించాలని నోటీసులో ప్రస్తావించారు అధికారులు. లేకుంటే తామే కూల్చివేస్తామని మఠం మేనేజర్‌కి వాటిని అందజేశారు.తొలగింపుకు అయ్యే ఖర్చు శారదాపీఠం నుంచే వసూలు చేస్తామన్నారు. చిన ముషిడివాడలో శ్రీశారదా పీఠం ఉంది. అందులో దాదాపు 22 సెంట్ల భూమి ప్రభుత్వ స్థలం ఉంది. అందులో 203 చదరపు గజాల స్వయం జ్యోతి మండపం ఉంది. 13 గజాల స్థలం సర్వే సంఖ్య 90లో ఉంది. మిగిలిన స్థలం సర్వే సంఖ్య 91/9లో వుడా లేఅవుట్‌కి సంబంధించిన ఓపెన్ స్పేస్‌లో ఉంది.190 చదరపు గజాల ప్రాంతంలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, వుడాకి సంబంధించి ఓపెన్ స్పేస్ ఉంది. ఓవరాల్‌గా చూస్తే శారదా పీఠంలో 9 శాశ్వత కట్టడాలు ఉన్నాయి. అందులో కొంత ప్రభుత్వ భూమి ఉంది. ప్రభుత్వం నోటీసులపై స్వామి నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. రేపో మాపో స్వరూపానందకు సంబంధించి ఇంకెన్ని కొత్త విషయాలు బయటకు వస్తాయో చూడాలి.