హైదరాబాద్, నవంబర్ 6, (వాయిస్ టుడే ): తెలంగాణలో హ్యట్రిక్ కొట్టడమే లక్ష్యంగా అధికార పార్టీ బీఆర్ఎస్ దూసుకుపోతుంది. పార్టీ బలం పెంచుకునేందుకు అన్ని పార్టీల నేతల రాకకు డోర్లు బార్లా తెరిచింది కారు పార్టీ. ప్రస్తుతం బీఆర్ఎస్‌లో చేరికలపై గందరగోళం నెలకొంది. ఎమ్మెల్యే అభ్యర్థులకు తెలియకుండానే తెలంగాణ భవన్‌లో చేరికలు జరుగిపోతున్నాయి. అయా నియోజకవర్గాల్లో ప్రత్యర్థులు సైతం అభ్యర్థులతో సంబంధం లేకుండానే గులాబీ కండువా కప్పుకుంటున్నారు. కొత్తగా చేరిన వారికి ఎన్నికల బాధ్యతలు అప్పగించాలా..? వద్దా..? వారు పార్టీలోకి వస్తే ఫ్లస్ అవుతారా..? మైనస్ అవుతారా అని లెక్కలు వేసుకుంటున్నారు అభ్యర్థులు. అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీఆర్ఎస్.. ఎన్నికల వేళ ఆపరేషన్ ఆకర్ష్‌తో దూసుకుపోతుంది. బీజేపీ, కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున్న నేతలు, కార్యకర్తలు ప్రతిరోజు అధికార పార్టీలోకి వచ్చి గులాబీ కండువా కప్పుకుంటున్నారు. కాంగ్రెస్, బీజేపీలో అభ్యర్థుల ప్రకటన తర్వాత మరింత జోరు అందుకుంది. మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు కొంతమంది నేతల ఇంటికి వెళ్లి మరీ, గులాబీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. మరి కొంతమందిని డైరెక్ట్ వార్ రూమ్ నుంచి ఆపరేషన్ చేసి పార్టీలోకి చేర్చుకుంటున్నారు. అయితే, వారి నియోజకవర్గాల్లో చేరుతున్న నేతల సమాచారం అయా నియోజకవర్గ అభ్యర్థులకు ఉండకపోవడం చర్చనీయాంశంగా మారింది.కొన్ని సందర్భాల్లో మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు పార్టీలో చేరాలనుకునే నేతల ఇంటికి వెళ్తున్న సమాచారం కూడా పార్టీ అభ్యర్థులకు ఉండటం లేదట. చాలా చేరికల్లో అభ్యర్థులు లేకుండానే జరిగిపోతున్నాయట. తాజాగా ఎల్బీనగర్ నియోజకవర్గంలో రామ్మోహన్ గౌడ్‌ను మంత్రి హరీష్ రావు పార్టీలో చేర్చుకునే సందర్భంలో స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ రెడ్డి లేకుండా జరిగిపోయిందట. అటు మానకొండూరు నియోజకవర్గం నుంచి బీజేపీ నేత గడ్డం మధు చేరే సందర్భంలో స్థానిక అభ్యర్థి రసమయి కిషన్ లేకుండానే కార్యక్రమం పూర్తయింది ఇలా చాలా చేరికలు అభ్యర్థులకు తెలియకుండా, వారు లేకుండానే జరిగిపోయాయట. కూకట్‌పల్లి కాంగ్రెస్ నేత గొట్టిముక్కల వెంగళరావు చేరిక విషయం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు చివరి నిమిషంలో సమాచారం ఇచ్చినట్ట పార్టీ వర్గాలే చెబుతున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో తమ ప్రత్యర్థి పార్టీ ముఖ్య నేతలు పార్టీలోకి వస్తుండటం, అభ్యర్థులకు గందరగోళంగా మారింది. వారు తమకు అనుకూలంగా పనిచేస్తారా ? తమకు నష్టం చేస్తారా ? అన్న చర్చ జరుగుతుంది. గత ఎన్నికల్లో తమ వ్యతిరేకంగా పనిచేసిన నేతలు కూడా పార్టీ ముఖ్యనేతల సమక్షంలో బీఆర్ఎస్ లో చేరుతున్నారు. నిన్నటి వరకు ప్రత్యర్థులుగా పనిచేసిన నాయకులు కూడా గులాబీ కండువా కప్పుకుంటున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో వారికి బాధ్యతలు అప్పగించాలా వద్దా అన్న మీమాంసలో అభ్యర్థులు ఉన్నారట.ఒక వైపు ఎన్నికల్లో అందరిని కలుపుకుపోవాలని పార్టీ అధిష్టానం అభ్యర్థులకు సూచిస్తోంది. అయితే కొత్తగా చేరుకున్న వారిని బాధ్యతలు ఇవ్వాలా వద్దా.. ఇప్పుడు తమకు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అని అంచనా వేసుకుంటున్నారు లోకల్ నాయకులు