ఢిల్లీకి చేరిన తెలంగాణ నేతలు
కిషన్ రెడ్డి, డికే అరుణ, నెల్లి శ్రీవర్థన్ రెడ్డి హాజరు
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో సినీ నటి జయసుధ బీజేపీలో చేశారు. జయసుధకు పార్టీ కండువ కప్పి సభ్యత్వ రశీదును తరుణ్ చుగ్ అందిచారు. పార్టీ చేరిక కార్యక్రమంలో కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్థన్ రెడ్డి
పాల్గొన్నారు. అంతకు ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సినీ నటి జయసుధ సమావేశమయ్యారు. పార్టీలో చేరే అంశంతోపాటు పలు కీలక అంశాలపై చర్చించారు. అన్ని వర్గాలకు బీజేపీ అండగా ఉంటుందని జయసుధకు అమిత్ షా చెప్పారు.
పార్టీలోకి జయసుధ రావడం సంతోషంగా ఉందని, అమెకు స్వాగతం పలుకుతున్నానని తరుణ్ చుగ్ తెలిపారు. బీజేపీలో చేరినట్లు జయసుధ తెలిపారు. మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందిందని, బీజేపీలో చేరాలని ఏడాది కాలం నుంచి అనుకుంటున్నానని ఆమె తెలిపారు. మతం, కులం పరంగా కాకుండా ప్రజలకు సేవ చేయాలని బీజేపీలో చేరానని జయసుధ చెప్పారు. క్రైస్తవుల తరుపున కూడా ప్రాతినిధ్యం వహిస్తానని ఆమె అన్నారు. “జయసుధకు మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నా. జయసుధ చేరిక పార్టీకి మరింత ఉత్సాహం. కుటుంబ, అవినీతి, నియంతృత్వ పాలన పోవాలని, ప్రజాస్వామ్య పాలనా రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే బీఆరెస్ ఓడిపోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. బస్తీలా అభివృద్ధిపై జయసుధకు చిత్తశుద్ధి ఉంది.” అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
“ప్రధాని విధానాలు నచ్చి బీజేపీలో చేరుతున్నారు. ప్రధాని నాయకత్వంలో భారత్ ఎంతో అభివృద్ధి చెందింది. సంవత్సరం నుంచి చర్చలు జరుగుతున్నాయి. అమిత్ షాను కలిశా. పని చేయాలనే తపనతోనే బీజేపీలోనే చేరుతున్నా. జయసుధగా, ప్రజలకు మంచి చేయాలనే జాతీయ పార్టీలో చేరాను. క్రైస్తవుల గొంతు వినిపిస్తూనే ఉంటా.” అని బీజేపీ నాయకురాలు జయసుధ అన్నారు. సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ జయసుధ పార్టీలోకి రావడం శుభ పరిణామం అని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీలో పలు నాయకులను కలిసినట్టు ఆయన మీడియాకు వివరించారు..