టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి త్రివేణి సంగమంలా ఈ రాష్ట్రాన్ని కాపాడుతాయని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. ‘యువతకు భరోసా ఇవ్వడానికి, ఈ ప్రాంతానికి కొబ్బరి బోర్డు తీసుకురావడానికి కృషి చేస్తాం.
కోనసీమకు కొబ్బరి అనుబంధ పరిశ్రమలు రావాలి. 5 కోట్ల మంది ప్రజలను కాపాడేందుకు, రైతు కన్నీరు తుడిచేలా కూటమి అండగా నిలుస్తుంది. పచ్చని అందమైన కోనసీమను వైసీపీ ప్రభుత్వం కలహాల సీమగా మార్చేందుకు ప్రయత్నించిందని పవన్ మండిపడ్డారు. రైతుభరోసా కేంద్రాలు కాకినాడ మాఫియా డాన్ చేతుల్లోకి వెళ్లాయి’ అని వ్యాఖ్యానించారు.
అంబాజీపేట సభలో మాట్లాడిన పవన్.. ‘కోనసీమను ప్రేమ సీమగా మార్చేందుకు మేం ముందుకు వచ్చాం. 2.5 లక్షల హెక్టార్ల కొబ్బరి తోటలతో నిండిన కోనసీమను కొట్లాట సీమగా మారకుండా మేం కృషి చేశాం. భవిష్యత్తులో కూడా ప్రేమ సీమగా ఉండేలా, అన్ని కులాల ప్రజలు, మైనార్టీలు కలిసి ఉండేలా పనిచేస్తాం’ అని వెల్లడించారు.
రాష్ట్ర భవిష్యత్తు కోసమే తాము కూటమిగా ఏర్పడినట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ‘రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. జగన్‌ను ఇక్కడి నుంచి తన్ని తరిమేస్తున్నాం. వాలంటీర్లలో కొందరే తప్పులు చేశారు. కొన్ని పండ్లు చెడిపోతే బుట్టలో మిగతా పండ్లు చెడిపోతాయి. వాలంటీర్లకు అధికారంలోకి రాగానే రూ.10వేలు వేతనం ఇస్తాం. వారు రాజకీయాలకు అతీతంగా ఉండాలి’ అని పవన్ సూచించారు.