తెలంగాణ టీడీపీ పగ్గాలు నారా లోకేష్‌కా..బ్రాహ్మణికా.!
TDP reins Nara Lokeshka..Brahmanika.!
హైదరాబాద్
తెలంగాణ తెలుగు దేశం పార్టీ బాధ్యతలు నారా లోకేశ్‌కి అప్పగించే అవకాశం ఉందా? నారా బ్రాహ్మణిని వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తారా? ఇదీ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి రిపోర్టర్లు అడిగినా ప్రశ్న. మీ ఆలోచనా విధానాలు చాలా ఫాస్ట్ ఉన్నాయి. మీ అంత వేగంగా మేం ఆలోచించడం లేదు. అక్కడైనా, ఇక్కడైనా తెలుగు జాతి బాగుండాలని కోరుకునే వ్యక్తి నేను అని చంద్రబాబు స్పందించారు. ఈ కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో వేడిని పెంచుతున్నాయి. రాష్ట్ర విభజన తరువాత టీడీపీ ఏపీకి పరిమితం అయింది. 2014 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమితో పోటీచేసి.. గ్రేటర్‌లో కీలక స్థానాలను కైవసం చేసుకున్న టీడీపీ, ఆ తర్వాత పక్కకు తప్పుకుంది.
2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జట్టుకట్టి మహాకూటమి పేరుతో ప్రజల్లోకి వెళ్లగా రెండుస్థానాలు గెలిచింది. ఆ ఎన్నికల్లో గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిపోవడంతో క్యాడెర్ చెరో దారి చూసుకున్నారు. విభజనకు ముందు తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర మూడు ప్రాంతాల్లో గట్టి పట్టున్న టీడీపీకి.. విభజన తర్వాత తెలంగాణకు ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అలా టీటీడీపీ అధ్యక్షుడిగా ఎల్ రమణను నియమించారు. 2014ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి వచ్చినా… తెలంగాణలో మాత్రం అనుకున్న ఫలితాలు రాలేదు. 2018ఎన్నికల తర్వాత టీడీపీ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఎల్ రమణ బీఆర్ఎస్‌లో చేరడంతో పార్టీ సీనియర్ నేత బక్కని నర్సింలుకు తెలుగు దేశం బాధ్యతలు అప్పగించారు. ఆయన సారథ్యంలోనూ టీటీడీపీ అభివృద్ధి దిశ వైపు నడుస్తున్న తరుణంలో ఆయనను పదవి నుండి తొలగించారు. టీడీపీ మరింతగా ప్రాభవం కోల్పోయింది.
కాసానికి అప్పగించినా ఫలితం శూన్యం.
2019లో ఏపీలోనూ తెలుగు దేశం పార్టీ ఓడిపోవడంతో తెలంగాణలోనూ ఆ పార్టీ గడ్డుపరిస్థితులు ఎదుర్కొంది. నేతలు పార్టీ మారినా. ఏళ్ల తరబడి టీడీపీ సిద్ధాంతాన్ని నమ్ముకుని వెన్నంటే ఉండే కార్యకర్తలు తెలుగు దేశానికి వెన్నెముకగా నిలిచారు.
అదే.. ఇప్పటికీ తెలంగాణలో టీడీపీకి బలమైన క్యాడర్ ఉండేలా చేసింది. ఏపీలో కూడా ఓడిపోవడంతో పార్టీ అధ్యక్ష బాధ్యతలను బీసీ నేత కాసాని జ్ఞానేశ్వర్‌కు అప్పగించారు. అయితే 2024 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయొద్దని టీడీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం మాజీ సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లోకి చేరారు. అలా వరుసగా పార్టీ అధ్యక్షులే ఇతర పార్టీల్లోకి జంప్ కావడంతో క్యాడర్ మరింత డీలా పడింది.
ఏపీ గెలుపుతో జోష్.
TDP reins Nara Lokeshka..Brahmanika.!
ఏపీలో అయిదేళ్ల అరాచకపాలనను అంతమొందిస్తూ.. టీడీపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేపట్టింది. ఇక తెలంగాణపైనా ఫోకస్ పెడతామన్న చంద్రబాబు.. అందుకు తగినట్లే అడుగులు వేస్తున్నారు. శనివారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కి వచ్చిన ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. టీటీడీపీలో పాత కమిటీలను రద్దు చేస్తూ నిర్ణయించారు. పార్లమెంట్, అసెంబ్లీ సెగ్మెంట్‌ల వారిగా ఉన్న కమిటీలను రద్దు చేశారు. ఏపీ, తెలంగాణలలో ఒకేసారి కొత్త కమిటీలు ఏర్పాటు చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. కమిటీల ఏర్పాటు అనంతరం టీటీడీపీ అధ్యక్షుడిని ప్రకటిస్తారని సమాచారం. అయితే తెలంగాణలోనూ పునర్వైభవం సాధించాలని చూస్తున్న టీడీపీ ఈసారి పెద్ద నేతలనే రంగంలోకి దింపాలని చూస్తోంది. టీటీడీపీ అధ్యక్ష బాధ్యతలను నారా బ్రాహ్మణి లేదంటే నారా లోకేష్‌కి ఇస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని రిపోర్టర్లు ప్రశ్నించగా.. బాబు కూడా నవ్వుతూ సమాధానమిచ్చారు. చంద్రబాబే రంగంలోకి దిగడంతో తెలంగాణలో టీడీపీకి పునర్వైభవం రావడం పక్కా అని ధీమా వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ తెలుగు తమ్ముళ్లు.