చీకటి జీవితాల్లో వెలుగు నింపేది ఉపాధ్యాయులే
Teachers are the ones who bring light in dark lives
విద్యార్థులను సన్మార్గంలో నడిపించాలి..
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్
చీకట్లో మగ్గుతున్న ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపుతున్నది ఉపాధ్యాయులేనని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సంర్భంగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులకు అవార్డు ప్రదానం చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలందరూ పాఠశాలకు వచ్చేలాగా తల్లిదండ్రులను ప్రోత్సహించవలసిన బాధ్యత ప్రతి ఉపాధ్యాయుడి పైనా ఉందన్నారు. కొన్ని కారణాల చేత విద్యార్థులను బడికి పంపకుండా పనిలోకి పంపుతారని అలాంటి వారిని గుర్తించి బడిలో చేర్పించాలని సూచించారు. మారుమూల గ్రామాల్లో ఎక్కువగా బాల్యవివాహాలు జరుగుతాయని, ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఈ వివాహాల సమాచారం తెలిసే అవకాశం ఉంటుందని, వారిని గుర్తించి బాల్యవివాహాలు నివారించాలని కోరారు. దానివల్ల చిన్నారుల భవిష్యత్తుకు బంగారు బాట వేసిన వారవుతారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే కొందరు ఉపాధ్యాయులు వారి స్వంత డబ్బులతో పిల్లలకు ఐడి కార్డులు, టై బెల్ట్ వంటి వస్తువులు కొనిస్తున్నారని, పాఠశాలలోని చిన్నచిన్న మరమ్మతులు చేయిస్తున్నారని తెలిపారు. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. ఈ మధ్యకాలంలో పాఠశాల విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలు అవుతున్న సంఘటనలు వెలుగుచూస్తున్నాయని, పిల్లల ప్రవర్తనను ఉపాధ్యాయులు గుర్తించి పెడదోవ పట్టకుండా చూడాలని కోరారు. జిల్లాలో గత ఏడాది పదో తరగతి సప్లమెంటరీ పరీక్షలు రాసిన 80 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించేందుకు ఉపాధ్యాయులు ఎంతో కృషి చేశారని కొనియాడారు. గుర్తింపుకు నోచుకోని ఎంతో మంది ఉపాధ్యాయులు నిశ్శబ్దంగా వారి సేవలను అందిస్తున్నారని వారికి పాదాభివందనం చేస్తున్నట్లు చెప్పారు.
పిల్లలకు గురువుతోనే అనుబంధం
ఎమ్మెల్యే గంగుల కమలాకర్
విద్యార్థులకు తల్లిదండ్రుల కంటే గురువుతోనే ఎక్కువ అనుబంధం ఉంటుందని కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ అన్నారు. విద్యార్థులు ఇంటిలో కంటే పాఠశాలలోనే ఎక్కువ సమయం గడుపుతారని తద్వారా గురువుతో అనుబంధం పెరుగుతుందని అన్నారు. రైతులు, ఉపాధ్యాయులు చేసే సేవ వెలకట్టలేనిదని కొనియాడారు. గురువు సూచించే సూచనలు పాటించి విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు.
అనంతరం జిల్లాలోని 44 మంది ప్రభుత్వ ప్రైవేటు ఉపాధ్యాయులకు అవార్డులో అందజేశారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పేయి, జిల్లా విద్యాధికారి జనార్ధన్ పాల్గొన్నారు.



