‘ఎమర్జింగ్ టెక్నాలజీస్’ హబ్‌గా తెలంగాణ,
హైదరాబాద్ ఏప్రిల్ 7
Telangana as a hub for ‘emerging technologies’,
తెలంగాణ నుంచి 2 లక్షల మంది ఏఐ ఇంజినీర్లను తయారు చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. కాన్సూలేట్ జనరల్ ఆఫ్ సింగపూర్ ‘ఎడ్గర్ పాంగ్’ నేతృత్వంలో ఆ దేశ ప్రతినిధులు సోమవారం డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయం లో మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ ను ‘ఎమర్జింగ్ టెక్నాలజీస్’ కు హబ్ గా మార్చేందుకు తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు వారికి వివరించారు. ఈ రంగంలో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా తెలంగాణ యువతను తీర్చిదిద్దుతామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నెలకొల్పుతున్న ఫ్యూచర్ సిటీ, అక్కడే ఏర్పాటు చేయబోతున్న ఏఐ యూనివర్సిటీ గురించి తెలిపారు. ఫ్యూచర్ సిటీలో భాగస్వామ్యమయ్యేందుకు అనేక అంతర్జాతీయ సంస్థలు ముందుకొచ్చాయని తెలిపారు. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల(జీసీసీ)కు హబ్ గా హైదరాబాద్ మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఏడాది వ్యవధిలోనే ఐటీ, హాస్పిటాలిటీ, ఇతర రంగాలకు చెందిన 70 జీసీసీలు ప్రారంభమయ్యాయని చెప్పారు. తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. పరిశ్రమల ఏర్పాటును ఒక్క హైదరాబాద్ కే పరిమితం చేయలేదని… వరంగల్, కరీంనగర్ లాంటి ఇతర నగరాలకు విస్తరించేలా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుకున్న అనుకూలతలపై స్థానిక పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పించాలని ప్రతినిధులను మంత్రి శ్రీధర్ బాబు కోరారు. టెక్నాలజీ, స్కిల్ డెవలెప్ మెంట్, ఇతర అంశాల్లో సింగపూర్ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సమావేశంలో కాన్సూల్ వైష్ణవి వాసుదేవన్, ఫస్ట్ సెక్రటరీ(ఎకానమిక్) వివేక్ రఘు రామన్, ఎంటర్ ప్రైజ్ సింగపూర్ రీజినల్ డైరెక్టర్ (ఇండియా – సౌత్) డేనిస్ టాం, తదితరులు పాల్గొన్నారు.
పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తెలంగాణ యువతను అన్ని రంగాల్లో అత్యుత్తమ నైపుణ్య మానవ వనరులుగా తీర్చి దిద్దుతామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ ఆఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ ప్రాంగణాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. అనంతరం స్కిల్స్ యూనివర్సిటీ అధికారులతో శ్రీధర్ బాబు సమీక్ష సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. అత్యుత్తమ నైపుణ్య మానవ వనరులకు చిరునామాగా తెలంగాణ రాష్ట్రాన్ని మార్చాలనే సంకల్పంతోనే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.తెలంగాణ యువతలో ప్రతిభకు కొదవ లేదన్నారు. అయితే మార్కెట్ అవసరాలకు అనుగుణంగా స్కిల్ డెవలప్మెంట్ లో శిక్షణ అందిస్తే మరింత మెరుగ్గా తయారవుతారని పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలతో నిరంతరం సంప్రదింపులు జరిపి.. కోర్సుల రూపకల్పనలో వారిని భాగస్వామ్యం చేయాలని సూచించారు. డిమాండ్ ఎక్కువగా ఉన్న కోర్సులపై ప్రధానంగా దృష్టి సారించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థులకు సాఫ్ట్ స్కిల్స్ లో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలన్నారు. కోర్సు పూర్తయ్యే లోగా యువతను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తీర్చి దిద్దాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రముఖ విద్యా, పరిశోధన, టాస్క్, డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ తదితర సంస్థలతో సమన్వయం చేసుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు.