20న తెలంగాణ బంద్…
వరంగల్, జూన్ 16, (వాయిస్ టుడే )
Telangana bandh on 20th...
భారతదేశంలో మావోయిస్టుల ఉనికిని పూర్తిగా అంతమొందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలతో సమన్వయంతో ముందుకు సాగుతోంది. ఈ వ్యూహంలో భాగంగా.. ఇటీవల కాలంలో ‘ఆపరేషన్ కగార్’
పేరుతో అటవీ ప్రాంతాల్లో తీవ్రమైన గాలింపు చర్యలు చేపట్టి, మావోయిస్టులను అణచివేసే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ ఆపరేషన్‌లో ఇప్పటికే వందల సంఖ్యలో మావోయిస్టులు ఎన్‌కౌంటర్లలో మరణించారు.
వీరిలో దశాబ్దాలుగా పార్టీలో కీలక భూమిక పోషించిన నాయకులు కూడా ఉన్నారు. కేంద్ర బలగాల ఈ చర్యలను మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. శాంతియుత చర్చలకు పిలుపునిస్తున్నాయి.
అయినప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఏ మాత్రం వెనకడుగు వేయకుండా.. మావోయిస్టుల ఏరివేతనే తమ ప్రధాన లక్ష్యంగా కొనసాగిస్తోంది.‘ఆపరేషన్ కగార్’ అనేది మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో వారిని
బలహీనపరచడానికి, వారి కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నేతృత్వంలో చేపట్టిన ఒక సమగ్ర సైనిక చర్య. ఈ ఆపరేషన్‌లో సీఆర్‌పీఎఫ్, గ్రేహౌండ్స్ వంటి ప్రత్యేక బలగాలు, రాష్ట్ర
పోలీసు దళాలు కలిసి పనిచేస్తాయి. దట్టమైన అటవీ ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాలను జల్లెడ పట్టి, మావోయిస్టుల స్థావరాలను ధ్వంసం చేయడం, వారి సరఫరా మార్గాలను తెగ్గొట్టడం ఈ ఆపరేషన్ ముఖ్య
లక్ష్యాలు.మావోయిస్టుల వ్యూహాలకు అనుగుణంగా, గెరిల్లా తరహా పోరాటంలో నిష్ణాతులైన బలగాలతో ఈ ఆపరేషన్ చేపడతారు. మావోయిస్టుల హింసాత్మక చర్యల వల్ల సాధారణ ప్రజలు, గిరిజనులు పడుతున్న
కష్టాలకు ముగింపు పలకడమే ఈ ఆపరేషన్ వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం. అయితే.. ఈ ఆపరేషన్ల సమయంలో అమాయకులు కూడా బలవుతున్నారని.. సరైన న్యాయ ప్రక్రియ పాటించడం లేదని మానవ హక్కుల
సంఘాలు విమర్శిస్తున్నాయి.. శాంతియుత పరిష్కారం కోసం ప్రయత్నాలు చేయాలని కోరుతున్నాయి.‘ఆపరేషన్ కగార్’ను తీవ్రంగా ఖండిస్తూ.. దానికి నిరసనగా మావోయిస్టులు ప్రతిస్పందించారు. ఈ నెల 20వ
తేదీన తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా బంద్‌కు పిలుపునిచ్చారు. ‘తెలుగు రాష్ట్రాల బంద్‌కు ప్రజలు సహకారం అందించి, విజయవంతం చేయాలని’ కోరుతూ మావోయిస్టు నేత జగన్ పేరుతో ఒక లేఖను
విడుదల చేశారు. ఈ లేఖలో తమ డిమాండ్లను, ఆపరేషన్‌పై తమ వ్యతిరేకతను తెలియజేశారు.మావోయిస్టు నేతలు బంద్‌కు పిలుపునివ్వడంతో.. భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఏఓబీ (ఆంధ్ర-ఒడిశా
సరిహద్దు), తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులతో పాటు అటవీ, ఏజెన్సీ ప్రాంతాల్లో భద్రతను గణనీయంగా ముమ్మరం చేశారు. ప్రధాన రహదారులపై, సరిహద్దు చెక్‌పోస్ట్‌ల వద్ద ఇరువైపులా వెళ్లే వాహనాలను క్షుణ్ణంగా
తనిఖీ చేస్తున్నారు. మావోయిస్టులు బంద్ సమయంలో విధ్వంసక చర్యలకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో.. బలగాలు హై అలర్ట్‌లో ఉన్నాయి. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితి
ఒక్కసారిగా మారిపోయింది. ప్రజల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. ఇది స్థానిక జనజీవనంపై, వ్యాపార కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది