3 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్
హైదరాబాద్, మార్చి 3, (వాయిస్ టుడే )
Telangana budget with 3 lakh crores
ఈనెల 3వ వారంలో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బడ్జెట్ రూపకల్పనపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క శాఖల వారీగా సమావేశాలు నిర్వహించి.. ప్రతిపాదనలు స్వీకరించారు. ఏ శాఖలో ఎలాంటి పథకాలు ఉన్నాయి.. నిధులు ఎంత అవసరం.. వంటి అంశాలపై ఓ అంచనాకు వచ్చారు.ఈసారి రాబడులపై భారీ ఆశలు ఉన్నాయని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో ఆదాయ లోటు వస్తే పరిస్థితి ఏంటనే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అనుకున్నంత మేర ఆదాయం రాలేదు. దీంతో వచ్చే ఏడాదికి సంబంధించి అంచనాలపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది.2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.2.91 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈసారి రూ.3 లక్షల కోట్ల పైనే ఉండొచ్చని తెలుస్తోంది. ఈ వారంలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అటు ఏపీ బడ్జెట్‌ను రూ.3.22 లక్షల కోట్లతో ప్రవేశపెట్టింది కూటమి ప్రభుత్వం. దాదాపు తెలంగాణ బడ్జెట్ కూడా అదే స్థాయిలో ఉండొచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా ఆశించిన స్థాయిలో రాలేదు. దాదాపు రూ.13 వేల కోట్లు సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీముల నుంచి రావాల్సి ఉండగా.. ఇప్పటి వరకు రూ.6 వేల కోట్లు కూడా రాలేదని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలపై పన్నుల భారం వేయకుండా.. ఆదాయం పెంచుకునే మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తోంది.నాన్ టాక్స్ రెవెన్యూ పెంచుకునేందుకు ప్రభుత్వం తాజాగా.. ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేసింది. దీని ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని భావిస్తోంది. అటు కేంద్రం నుంచి కేవలం పన్నుల వాటా, ప్రాయోజిత పథకాల నిధులు, ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు తప్ప వేరే అవకాశం కనిపించడం లేదు. మరోవైపు కేంద్రం కూడా ఈసారి బడ్జెట్‌ను గతం కంటే రూ.2.5 లక్షల కోట్లు మాత్రమే పెంచింది. ఈ నేపథ్యంలో తెలంగాణ బడ్జెట్ ఎలా ఉండబోతోందనే ఆసక్తి నెలకొంది.