హైదరాబాద్, అక్టోబరు 30, (వాయిస్ టుడే ): చోరీకి గురైన ఫోన్లను రికవరీ చెయ్యడంలో దేశంలోనే తెలంగాణ మొట్ట మొదటి స్థానంలో నిలిచింది. సాధారణంగా రద్దీ ప్రాంతాలనే లక్ష్యంగా చేసుకొని పర్సులు, సెల్ ఫోన్లు కొట్టేస్తూ ఉంటారు దొంగలు. అయితే పోగొట్టుకున్న పర్సులు, డబ్బులు దొరకకపోవచ్చు కానీ సెల్ ఫోన్ మాత్రం అలా కాదు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి అతి తక్కువ సమయంలోనే పోగొట్టుకున్న సెల్ ఫోన్ ను ట్రేస్ చేసి ఎక్కడుందో గుర్తించవచ్చు. అయితే ప్రస్తుతం ఇదే సాంకేతికతను ఉపయోగించి తెలంగాణ పోలీసులు… పోగొట్టుకున్న ఫోన్లను రికవరీ చేసి రికార్డ్ సృష్టించారు.సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిష్టర్ (CEIR) పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న, చోరీకి గురైన సెల్ ఫోన్ల రికవరీలో తెలంగాణ దేశంలోని అన్నీ రాష్ట్రాలను అధిగమించి అగ్రస్థానంలో నిలిచింది. సీఈఐఆర్ డేటా ప్రకారం తెలంగాణలో 39 శాతం ఫోన్లను తెలంగాణ పోలీసులు రికవరీ చేశారు. అయితే ఈ రికవరీ ఆపరేషన్ సీఐడీ అడిషనల్ డీజీ మహేష్ భగవత్ నేతృత్వంలో జరిగింది. ఈ సందర్భంగా డీజీపీ అంజన్ కుమార్ యాదవ్ పోలీస్ బృందాన్ని అభినందించి శుభాకాంక్షలు తెలియచేశారు. మొత్తం 190 రోజుల్లో 10,018 స్మార్ట్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. వీటిలో చివరి 14 రోజుల్లో 1000 స్మార్ట్ ఫోన్లను యజమానులకు అందచేశారు.తెలంగాణ తరువాత 36 శాతం రికవరీతో కర్ణాటక రెండో స్థానంలో నిలిచింది. ఆ తరువాత 30% రికవరీతో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచింది. కాగా 2023 ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు దాదాపు 86,395 స్మార్ట్ ఫోన్లను పోలీసులు బ్లాక్ చేయగా, అందులో 25,598 ఫోన్లకు ట్రేసబిలిటీ నివేదికలు అందినట్లు, 10,018 ఫోన్లను అన్ బ్లాక్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మొబైల్ ఫోన్ దొంగతనం, నకిలీ మొబైల్ పరికరాలకు చెక్ పెట్టేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలి కమ్యూనికేషన్ (డీఓటీ) సీఈఐఆర్ పోర్టల్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ 17న దేశవ్యాప్తంగా ఈ పోర్టల్ ప్రారంభం అయింది. ఇది తెలంగాణలో ఉన్న అన్నీ పోలీస్ స్టేషన్ లో అందుబాటులో ఉంటుంది.



