తెలంగాణ లాసెట్-2024 నోటిఫికేషన్ విడుదల…!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లా కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి మూడు, అయిదేళ్ల లా కోర్సుల్లో ప్రవేశాలకు లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ లాసెట్- 2024), తెలంగాణ పీజీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ పీజీఎల్‌సెట్-2024) నోటిఫికేషన్లను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (టీఎస్‌సీహెచ్‌ఈ) విడుదల చేసింది.ఈ ప్రవేశ పరీక్షల ద్వారా మూడు సంవత్సరాల ఎల్‌ఎల్‌బీ కోర్సు, ఐదు సంవత్సరాల ఎల్‌ఎల్‌బీ, రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ పరీక్షలు నిర్వహిస్తోంది. అర్హులైన అభ్యర్థులు శుక్రవారం (మార్చి 1) నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.తెలంగాణ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ లాసెట్), తెలంగాణ పీజీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ పీజీఎల్‌సెట్)-2024లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జూన్ 3వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు.. మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో ప్రవేశాలకు ఏదైనా గ్రాడ్యుయేట్ డిగ్రీ అర్హత ఉండాలి. అయిదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుకు ఇంటర్మీడియట్ అర్హత, ఎల్‌ఎల్‌ఎం కోర్సుకు ఎల్‌ఎల్‌బీ లేదా బీఎల్ ఉత్తీర్ణులై ఉండాలి.