తెలంగాణ సెమాగ్లుటైడ్ బ్యాన్
హైదరాబాద్, మార్చి 25, (వాయిస్ టుడే )
Telangana Semaglutide Ban
బరువు తగ్గడం కోసం, మధుమేహ నియంత్రణ కోసం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ పొందుతున్న సెమాగ్లుటైడ్ మెడిసిన్ వాడకంపై తెలంగాణ రాష్ట్ర ఔషధ నియంత్రణ విభాగం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. సరైన వైద్య పర్యవేక్షణ లేకుండా, సొంత నిర్ణయాలతో ఈ మందులను వాడటం వల్ల ప్రాణాపాయం జరిగే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. ఇటీవల ఈ ఔషధాలకు సంబంధించిన పేటెంట్ గడువు ముగియడంతో మార్కెట్‌లోకి అనేక రకాల కొత్త ఫార్ములేషన్లు అందుబాటులోకి వస్తున్న వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం కోరింది. సెమాగ్లుటైడ్ అనేది గ్లూకాగాన్-లైక్ పెప్టెడ్-1 రిసెప్టర్ అగోనిస్ట్స్ అనే తరగతికి చెందిన ఔషధం. ఇది శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంతోపాటు, ఆకలిని తగ్గించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా టైప్ -2 డయాబెటిస్ బాధితులకు ఇది ఒక వరప్రసాదంగా మారింది. అయితే ఇటీవల కాలంలో కేవలం బరువు తగ్గడం కోసమే దీనిని వాడే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. గత వారమే ఈ ఔషధాల అసలు ఆవిష్కర్త పేటెంట్ గడువు ముగిసింది. దీని వల్ల వివిధ కంపెనీలు మల్టీ డోస్ వయల్స్, ప్రీ- ఫీల్డ్ పెన్స్ రూపంలో సెమాగ్లుటైడ్ ఫార్ములేషన్లు మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాయి. మార్కెట్‌లోకి కొత్తగా వస్తున్న ఈ మందులపై ప్రజలకు అవగాహన లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని అక్రమ విక్రయాలు జరిగే అవకాశం ఉందని DCA గుర్తించింది. తెలంగాణ డీసీఏ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం సెమాగ్లుటైడ్ కేవలం రిజిస్టర్ మెడికల్ ప్రాక్టీషనర్ల పర్యవేక్షణలో వాడాలి. ఎండోక్రినాలజిస్టులు, ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్టులు మాత్రమే ఈ మందులను ప్రిస్క్రైబ్ చేయాలి. గుండె సంబంధిత సమస్యలు ఉండి, ఆమోదించే సంకేతాలు ఉన్న సందర్భాల్లో మాత్రమే కార్డియాలజిస్టులు దీనిని సూచించవచ్చు. రోగికి ఈ మందును సూచించే ముందు వారి ఆరోగ్య చరిత్ర, ఇప్పటికే ఉన్న ఇతర వ్యాధులు, ఎదురయ్యే ముప్పును వైద్యులు నిశితంగా పరిశీలించారు. సరైన మోతాదు, ఎంత కాలం వాడాలి అనే విషయాలను నిపుణులైన డాక్టర్లు మాత్రమే నిర్ణయించాల్సి ఉంటుంది.
అజాగ్రత్తా వాడితే పొంచి ఉన్న సమస్యలు
సరైన వైద్య పర్యవేక్షణ లేని పక్షంలో సెమాగ్లుటైడ్ వాడకం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని డీసీఏ హెచ్చరించింది. అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అంటే క్లోమగ్రంథి వాస్తుంది. మూత్రపిండాలు ఒక్కసారిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. విపరీతమైన కడుపు నొప్పి, వాంతులు, ఇతర తీవ్రమైన ప్రతి చర్యలు ఉంటాయి. గాల్ బ్లాడర్‌లో రాళ్లు రావడం, ఇతర సమస్యలు రావచ్చు. ప్రజలు సెమాగ్లుటైడ్ మెడిసిన్‌ను కేవలం లైసెన్స్ ఉన్న మెడికల్ షాపులో నుంచి మాత్రమే కొనుగోలు చేయాలి. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు, అనధికారక విక్రేతల వద్ద, ఇతర చట్టవిరుద్ధమైన మార్గాల ద్వారా వీటిని ఆర్డర్ చేయొద్దు. ఇలాంటి మార్గాల్లో లభించే మందులు నకిలీవి, నాణ్యత లేనివి, హాని చేసేవి అయ్యి ఉంటాయని హెచ్చరించింది.
తయారీదారులకు హెచ్చరిక
మందుల తయారీ కంపెనీలకు కూడా ప్రభుత్వం కఠిన ఆదేశాలు జారీ చేసింది. సెమాగ్లుటైడ్ వాడకాన్ని ప్రోత్సహించేలా ఎటువంటి పరోక్ష ప్రకటనలు ఇవ్వకూడదని స్పష్టం చేసింది. వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా లేదా అన్ అప్ప్రూవ్డ్ వాడకాన్ని ప్రోత్సహించేలా ప్రమోషన్లు చేస్తే చర్యలు తప్పవని చెప్పింది. ఒక వేళ ఎక్కడైనా ఈ మందులను అక్రమంగా విక్రయిస్తున్నట్టు తెలిసినా, అనధికారికంగా ప్రచారం చేస్తున్నట్టు గమనించినా వెంటనే తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్‌కు ఫిర్యాదు చేయాలని అధికారులు ప్రజలను కోరారు.



