నారా లోకేష్, నాదెండ్ల మనోహర్ తో “తెలుగు శక్తి” భేటీ
– అధికారులు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువస్తున్నారు
– ఇప్పటికీ అధికారులు వైయస్ జగన్ భజన చేస్తున్నారు
– తాజాగా శారదా పీఠం ఆక్రమణల తొలగింపు విషయంలోనూ ఉదాశీన వైఖరి
—- తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్
"Telugu Shakti" meets Nara Lokesh and Nadendla Manohar
విశాఖ :
రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ను.. తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ సోమవారం విడి విడి గా కలుసుకున్నారు. ముందుగా నారా లోకేష్ ను రామ్ నగర్ లోని తెలుగుదేశం పార్టీ విశాఖ ప్రధాన కార్యాలయంలోనూ, నాదెండ్ల మనోహర్ ను సీతమ్మ పేట లోని జనసేన కార్యాలయంలోనూ కలుసుకున్నారు. ఈ సందర్భంగా బి.వి.రామ్ మీడియాతో మాట్లాడుతూ.. అధికారులు అనుసరిస్తున్న విధానాలు కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే విధంగా ఉన్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రస్తుత స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జీవీఎంసీ మాజీ మేయర్ సబ్బం హరి నివాస గృహాలతో పాటు.. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన గీతం విశ్వవిద్యాలయంలో కొంత భాగాన్ని కూడా ఎటువంటి నోటీసులు జారీ చేయకుండానే అధికారులు కూల్చివేతలకు పాల్పడ్డారన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. పంతులు గారి మేడ ప్రాంతంలో అక్రమ నిర్మాణం నిర్మిస్తున్నప్పటికీ వెంటనే కూల్చివేయకుండా నోటీసులు జారీ చేశారన్నారు. ఈ క్రమంలోనే అమర్నాథ్ హైకోర్టుకు వెళ్లి కూల్చివేతలను అడ్డుకున్నారని తెలిపారు. ఈ ప్రక్రియకు పరోక్షంగా అధికారుల వైఖరే కారణమని బి.వి.రామ్ ఆరోపించారు. అధికారులు ఇప్పటికీ ఎందుకు వైసీపీకి కొమ్ముకాస్తున్నారో అర్థం కావడం లేదని విచారం వ్యక్తం చేశారు. తాజాగా.. కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాబట్టి.. శారదా పీఠానికి ముందుగా నోటీసులు జారీ చేసిందన్నారు. అయినప్పటికీ మరో మూడు వారాలు గదువు కావాలని పీఠం కోరడం అందుకు.. తహసీల్దార్ అంగీకరించడం సబబు కాదన్నారు. ఇదిలా ఉండగా పెందుర్తి లోని ఆక్రమిత భూములలో శారదాపీఠం నిర్మించారని.. ప్రభుత్వం దృష్టి సారించారని గత అక్టోబర్ నుంచి పోరాటం చేస్తున్నామని తెలిపారు.
ఆ ఆలయాలను ప్రభుత్వమే నిర్వహించాలి
హిందూ వాదిగా ఆలయాల కూల్చివేత తమ అభిమతం కాదని.. ఆక్రమిత భూమిలో ఉన్న ఆలయాలను ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని నిర్వహించాలని కోరుతున్నామన్నారు. అధికారులు అనుసరిస్తున్న వైఖరి,శారదా పీఠం అంశాన్ని నారా లోకేష్, నాదెండ్ల మనోహర్ దృష్టి కి తీసుకు వెళ్లామన్నారు. అధికారుల వైఖరిలో మార్పు రాకపోతే సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకు వెళ్తామని రామ్ హెచ్చరించారు.
తెలుగు శక్తి యువత అభివృద్ధి సలహాదారు వి. వంశీ బాబు, పి.శ్రీనివాసరావు, పి.రితేష్ తదితరులు కలిసిన వారిలో ఉన్నారు.