నాగార్జున సాగర్: తెలంగాణలో రాష్ట్రంలో ఎన్నికల జరుగుతున్నరోజు నాగార్జునసాగర్ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. కుడి కాలువనుంచి నీరు విడుదల చేయడానికి ఏపీ అధికారులు, పోలీసులు సాగర్ దగ్గరకు చేరుకున్నారు. ప్రాజెక్టుకు ఉన్న 26 గేట్లలో సగభాగమైన 13వ గేట్ వరకు తమ పరిధిలోకి వస్తుందని చెబుతూ 500 మంది పోలీసులతో కలిసి వచ్చిన ఆ శాఖ ఉన్నతాధికారులు తమను అడ్డుకున్న డ్యామ్ సిబ్బందిపై దాడిచేశారు. వారి మొబైల్ ఫోన్లతోపాటు అక్కడి సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారు. అనంతరం 13వ గేట్ వరకు ముళ్లకంచె ఏర్పాటు చేసి డ్యామ్ను తమ అధీనంలోకి తీసుకున్నారు. నాగార్జున సాగర్ గొడవపై తెలంగాణ ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ రాజకీయ నేతలకు కీలక సూచన చేశారు. ఈ గొడవ విషయం పోలీసులకు వదిలివేయాలని, వాళ్లే చూసుకుంటారని చెప్పారు. ఏ పార్టీకి చెందిన నేతలైనా సరే దీనిపై ఎవరూ ఏమీ మాట్లాడవద్దని హెచ్చరించారు.



