22ఏ భూముల జాబితాను వెంటనే రద్దు చేయాలి: హరీశ్‌రావు
తప్పుగా చేర్చిన భూములను ప్రభుత్వమే తొలగించాలి
రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాజీనామా చేయాలి
The ’22A’ land list must be cancelled immediately: Harish Rao
మల్కాజ్గిరి, ఆగస్టు 18 (వాయిస్ టుడే): 22ఏ నిషేధిత భూముల జాబితాలో చేర్చిన భూములను వెంటనే తొలగించాలని బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు డిమాండ్ చేశారు. మల్కాజ్‌గిరిలో 22ఏ భూముల సమస్యపై నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
“రేవంత్‌రెడ్డి తీరు పిచ్చోడి చేతిలో రాయిలా మారింది. సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం కొత్త సమస్యలను సృష్టిస్తోంది. రాత్రికి రాత్రే కాలనీలకు కాలనీలను 22ఏ నిషేధిత జాబితాలో చేరిస్తే ప్రజలు ఎక్కడికి పోవాలి?” అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
2008లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ULCని రద్దు చేసిందని, అనంతరం ఆయా భూములు పట్టా భూములుగా మారి ఏళ్లుగా ప్రజలు నివసిస్తున్నారని ఆయన తెలిపారు. 20 ఏళ్లుగా లేని సమస్యను ఇప్పుడు ఎందుకు సృష్టించారని ప్రశ్నించారు.
రంగారెడ్డి జిల్లాలో GOల ద్వారా మినహాయింపు పొందిన భూములు, మేడ్చల్‌లోని వేలాది భూములు, HMDA, HUDA భూములను సైతం 22ఏ నిషేధిత జాబితాలో చేర్చారని హరీశ్‌రావు ఆరోపించారు. భూమి విక్రయానికి వెళ్లే వరకు తమ స్థలం నిషేధిత జాబితాలో ఉందనే విషయం కూడా ప్రజలకు తెలియడం లేదన్నారు.
ప్రభుత్వమే తప్పును సరిదిద్దాలి
తప్పుగా భూములను జాబితాలో చేర్చిన ప్రభుత్వం వాటిని తొలగించేందుకు ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకుని కార్యాలయాల చుట్టూ తిప్పకూడదని హరీశ్‌రావు అన్నారు. “ఎట్లా పెట్టారో అట్లాగే తొలగించాలి” అని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబర్ సక్రమంగా పనిచేయడం లేదని విమర్శించారు. 22ఏ జాబితాలో చేర్చిన భూములు, అనంతరం తొలగించిన భూముల పూర్తి వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని, ఈ వ్యవహారంపై ప్రభుత్వం వైట్‌పేపర్ విడుదల చేయాలని కోరారు.
రెవెన్యూ మంత్రి రాజీనామాకు డిమాండ్
22ఏ నిషేధిత భూముల వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాజీనామా చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా చోటుచేసుకున్న ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బాధ్యత వహించి చర్యలు తీసుకోవాలని కోరారు.
రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో 22ఏ భూముల సమస్యపై బీఆర్ఎస్ ప్రజల తరఫున పోరాటం చేస్తుందని హరీశ్‌రావు స్పష్టం చేశారు. “కేసీఆర్ నాయకత్వంలో ప్రజలకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది. తెలంగాణ ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడుతాం” అని తెలిపారు.




