తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేతలు సత్తా చాటారు. వారితో పాటు ఖమ్మం, నల్గొండ జిల్లాలో పార్టీ ఘన విజయం సాధించేలా కృషి చేశారు. ఖమ్మం జిల్లా మధిర నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, హుజూర్‌నగర్ నుంచి మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నాగార్జున సాగర్ నుంచి మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడు జైవీర్‌రెడ్డి, కోదాడ నుంచి ఉత్తమ్ పద్మావతి, మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు.
తెలంగాణలో ప్రజాస్వామ్యం గెలిచింది: ఉత్తమ్
సూర్యాపేటలోని కౌంటింగ్ కేంద్రం వద్ద మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. అత్యధిక మెజార్టీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్యం గెలిచింది.. తెలంగాణలో భారాసకు ఇదే చివరి రోజని వ్యాఖ్యానించారు. ఏఐసీసీ నిర్ణయం మేరకు సీఎం అభ్యర్థిని ప్రకటిస్తారని వెల్లడించారు.
ఈ విజయం సంతృప్తి నిచ్చింది: భట్టి విక్రమార్క
మధిరలో ఘన విజయం సాధించిన భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు.‘‘ఎన్నికల్లో ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు. ఈ విజయం చాలా సంతృప్తి నిచ్చింది. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినందుకు కృతజ్ఞతలు. ఆరు గ్యారంటీలు, మేనిఫెస్టోలో ఇచ్చిన హమీలు నెరవేరుస్తాం. నీళ్లు, నిధులు, నియమకాల కోసం పోరాడిన తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే విధంగా పనిచేస్తాం. అత్యధిక మెజార్టీతో గెలిపించిన మధిర నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు’’ భట్టి విక్రమార్క తెలిపారు.
ఈ విజయం సోనియాగాంధీకి బర్త్‌డే గిఫ్ట్‌గా ఇస్తున్నాం: కోమటిరెడ్డి
సీఎం అభ్యర్థిపై ఎమ్మెల్యేలంతా కలిసి నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ విజయాన్ని సోనియాగాంధీకి బర్త్‌డే గిఫ్ట్ ఇస్తున్నామని అన్నారు. తాను సీఎం రేసులో ఉన్నానా? లేదా? అన్నది అప్రస్తుతమని వ్యాఖ్యానించారు. పీసీసీ అధ్యక్షుడు కాబట్టే రేవంత్‌రెడ్డిని డీజీపీ కలిశారని అన్నారు. జగదీశ్వరెడ్డి డబ్బుతో గెలిచారు. మా మెజార్టీలు చూస్తే అర్థమవుతుంది..నల్గొండ జిల్లాలో 12 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టే లెక్క అని వ్యాఖ్యానించారు. తన విజయం కోసం 24 గంటలూ కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు కోమటిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
డిసెంబరు3 తెలంగాణ చరిత్రలో నిలిచిపోతుంది: రాజగోపాల్‌రెడ్డి
‘‘డిసెంబరు 3న తెలంగాణ ప్రజల నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుంది. భారాస హయాంలో ప్రజాస్వామ్యం ఖూనీ చేయబడింది. ఆత్మగౌరవం కోసం పోరాటం చేసిన తెలంగాణలో ఒక కుటుంబం దోచుకుంది. అందుకే భారాసకు ప్రజలు చరమ గీతం పాడారు. నా ఆశయం, లక్ష్యం నెరవేరినందుకు సంతోషంగా ఉన్నా. సోనియా గాంధీకి తెలంగాణ ప్రజలు గిఫ్ట్ ఇచ్చినందుకు సంతోషం’’ అని రాజగోపాల్‌రెడ్డి అన్నారు.