బేగంపేట: బాలికతో పరిచయం పెంచుకుని, ప్రేమ పేరిట వేధించడమే కాకుండా బెదిరింపులకు పాల్పడిన నిందితుడికి మూడేళ్ల జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. బేగంపేట ఎస్సై గంగాధర్ తెలిపిన వివరాలు… 2021 అక్టోబరులో బేగంపేట స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న ఓ బాలికతో మెదక్ జిల్లా అల్లాదుర్గంకు చెందిన బి.సురేష్(21) పరిచయం పెంచుకున్నాడు. ప్రేమ పేరిట వెంటపడ్డాడు. తరచూ వీడియో కాల్స్ చేస్తుండేవాడు. బాలిక చిత్రాలు, వీడియోలను మార్ఫింగ్ చేసి బాధితురాలితో పాటు ఆమె తల్లిదండ్రులకు పంపి.. డబ్బులు ఇవ్వాలని వేధించేవాడు. దీంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోక్సో చట్టం కింద నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కేసు పూర్వాపరాలను విచారించిన నాంపల్లిలోని 12 అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి టి.అనిత నిందితుడికి శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ గురువారం తీర్పు చెప్పారు.



