గ్రామ సచివాలయం, ఆర్బీకే, హెల్త్ క్లినిక్ భవనాలను ప్రారంభించిన హోంమంత్రి తానేటి వనిత
దేశంలో ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చి.. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇంటి ముంగిటకే పాలన అందిస్తోందని రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. తాళ్లపూడి మండలం పోచవరం గ్రామంలో ఒకే ప్రాంగణంలో నిర్మించిన రెండస్తుల గ్రామ సచివాలయ బిల్డింగ్, వైఎస్సార్ రైతు భరోసా కేంద్రం, డా. వైఎస్సార్ హెల్త్ క్లినిక్ భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. కేక్ కట్ చేసి పంచిపెట్టారు. స్థానిక ప్రజలు జై జగన్ అంటూ.. మంత్రి తానేటి వనిత నాయకత్వం వర్థిల్లాలని గట్టిగా నినాదాలు చేయడం గమనార్హం.
ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ… ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఈ గ్రామ సచివాలయాలు ప్రజలు బాగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. తమది ప్రజల ప్రభుత్వమని, ప్రజా సంక్షేమ ప్రభుత్వమని తెలిపారు. అవినీతికి కానీ, వివక్షతకు కానీ తావు ఇవ్వకూడదని, పరిపాలన అన్నది ప్రజలకు చేరువ కావాలన్న ప్రధాన ఉద్దేశంతో ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారని తెలిపారు. గ్రామ,వార్డు సచివాలయాల్లో దాదాపు 35 ప్రభుత్వ శాఖలకు సంబంధించి 500 సేవలకు పైగా అందిస్తున్నారని తెలిపారు. పింఛన్ కావాలన్నా.. రేషన్ కార్డు కావాలన్నా.. ఇంటి పట్టాలు కావాలన్నా.. తాగునీటి సరఫరా సమస్య ఉన్నా.. సివిల్ పనులకు సంబంధించిన పనులు ఉన్నా.. వైద్యం కానీ.. ఆరోగ్యం కానీ.. రెవిన్యూ కానీ.. భూముల సర్వేకానీ.. శిశు సంక్షేమం కానీ.. డెయిరీ కానీ, పౌల్టీ రంగాల సేవలు కానీ.. ఇలాంటివెన్నో గ్రామ సచివాలయాల్లో అర్జీ పెట్టుకున్న 72 గంటలోనే సమస్యను పరిష్కరిస్తున్నారని తెలిపారు. అర్హత ఉన్న ఏ ఒక్కరూ తమకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందలేదని బాధపడే సమస్య రాకూడదని.. గడప గడపకు మన ప్రభుత్వం, జగనన్నకు చెబుదాం, జగనన్న సురక్ష కార్యక్రమాల ద్వారా 100 శాతం పథకాలు అర్హులందరికీ అందించేలా జగనన్న ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. పోచవరం గ్రామంలో ఒకే ప్రాంగణంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్ లను ఒకే రోజున ప్రారంభించడం సంతోషాన్నిచ్చిందన్నారు. రైతు భరోసా కేంద్రాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తూ.. రైతుల ఇంటి ముంగిటనే విత్తనం నుంచి పంట విక్రయం వరకూ అన్ని సేవలు అందిస్తున్నాయన్నారు. గతంలో మండల కేంద్రాలకు వెళ్లితే అక్కడ సేవలు అందుబాటు ఉంటాయో.. ఉండవో తెలియని గందరగోళ పరిస్థితి ఉండేదని.. కానీ ఇఫ్పుడు వాలంటీర్ల ద్వారా అన్ని సేవలు ఇంటి వద్దనే అందరజేస్తున్నామని హోంమంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ ఛైర్మన్ పోసిన శ్రీలేఖ, ఎంపీపీ పోసి రాజు, సర్పంచ్ కాకర్ల హేమలత, పైడిమెట్ట ఎత్తిపోతల పథకం అధ్యక్షుడు కాకర్ల వెంకటేశ్వరరావు, సోసైటీ ఛైర్మన్ దొరబాబు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.