అంగన్వాడీ పోరాటం తాత్కాలిక విరామం మాత్రమే
హామీల అమలుకు ఆదేశాలివ్వాలి
కాకినాడ,
అంగన్వాడీలకు 42 రోజుల సమ్మె సందర్భంగా సీఎం జగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు తక్షణం ఆదేశాలు విడుదల చేయాలని, సమ్మె విజయవంతానికి సహకరించిన ప్రజా సంఘాలకు, కార్మిక సంఘాలకు, మహిళా సంఘాలకు, రాజకీయ పార్టీలకు, ముఖ్యంగా అంగన్వాడీల లబ్ధిదారులకు, రాష్ట్ర ప్రజానీకానికి ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం స్థానిక కచేరిపేటలోని సిఐటియు కార్యాలయంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో విలేకరులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు జి బేబిరాణి, జిల్లా అధ్యక్షురాలు దడాల పద్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏరుబండి చంద్రవతిలు మాట్లాడుతూ గతేడాది డిసెంబరు 12 నుండి మొదలైన అంగన్వాడీ సమ్మె జనవరి 22 అర్ధరాత్రితో ముగిసిందని, దానర్థం పోరాటం ముగిసినట్లు కాదని తాత్కాలిక విరామమేనని తెలియజేశారు. జగన్ ప్రభుత్వం అధికారికంగా మినిట్స్ ప్రిన్సిపాల్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ, స్త్రీ శిశు సంక్షేమశాఖ అధికారుల సంతకాలతో రాతపూర్వకంగా ఇస్తానని, సమ్మె కాలం వేతనాలు చెల్లించేలాగా, సమ్మెలో నాయకులపై, అంగన్వాడీలపై పెట్టిన కేసులు ఎత్తివేసేలా, తొలగించిన వారందరినీ బేషరతుగా విధులలోకి తీసుకునేలా అంగీకరించిన తరువాతే విరమించినట్లు వారు తెలిపారు.
ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యురాలు బాలం లక్ష్మీ, జిల్లా ఆఫీస్ బేరర్స్ రాజేశ్వరి, నాగమణి, ఎస్తేరు రాణి, బుల్లెమ్మ, మేరీ సమాధానం, లక్ష్మీ, వీరవేణి, చామంతి, నీరజ తదితరులు పాల్గొన్నారు.