విజయవాడ ఇంద్రకీలాద్రి పై పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ముగిశాయి. మూడ్రోజుల పాటు ఘనంగా అమ్మవారి పవిత్రోత్సవాలు కొనసాగాయి. ఏడాదిలో తెలిసీ తెలియక చేసిన తప్పిదాలకు ప్రాయశ్చిత్తంగా అమ్మవారి పవిత్రోత్సవాలు నిర్వహించామని దుర్గగుడి ఈఓ భ్రమరాంబ తెలిపారు.మరోవైపు విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రావణ శోభతో అలరారుతోంది. శ్రావణ మాసం కావడంతో అమ్మవారి దర్శనానికి రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు. వేకువజాము నుండి ప్రారంభమైన భక్తుల రద్దీ కొనసాగుతోంది. దేవస్థాన ఈవో భ్రమరాంబ, చైర్మన్ కర్నాటి రాంబాబు నేతృత్వంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. వారికి త్వరితగతిన దర్శనం అయ్యేలా చర్యలు తీసుకున్నారు.

భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం ఆచరించిన మహిళలు
మహిళలు అత్యంత పవిత్రంగా భావించే శ్రావణ మాసం మూడవ శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించారు. ఇళ్లలో వరలక్ష్మి అమ్మవారి చిత్రపటాలు, విగ్రహాలను ఏర్పాటు చేసి పూలతో అలంకరించారు. కుటుంబ సభ్యులతో కలిసి శాస్త్రోక్తంగా అమ్మవారి పూజలు చేశారు. వరలక్ష్మి వ్రతం పురస్కరించుకుని మార్కెట్లో పూలు, పండ్ల ధరలను వ్యాపారస్తులు భారీగా పెంచేశారు. తప్పని పరిస్థితుల్లో భక్తులు వాటిని కొనుగోలు చేశారు.




