జహీరాబాద్ : ఎనిమిది నెలల చిన్నారిని అపహరించి కర్ణాటక బస్సులో పారిపోతున్న మహిళను సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ పోలీసులు శనివారం అర్ధరాత్రి పట్టుకున్నారు. పట్టణ ఎస్‌ఐ లక్ష్మారెడ్డి తెలిపిన వివరాలు.. హైదరాబాద్ చంచల్‌గూడలో నివాసముండే దంపతులకు కుమార్తె అమరయా సిద్ధిఖీ(9 నెలలు) ఉంది. చిన్నారి సంరక్షణకు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన నుస్రత్ షాజహాన్ బేగంను కేర్‌టేకర్‌గా పని కుదుర్చుకున్నారు. శనివారం ఇంటి పనులు పూర్తి చేసిన ఆమె.. ఎవరూ లేని సమయంలో చిన్నారిని కిడ్నాప్ చేసింది. విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు హైదరాబాద్ మాదన్నపేట ఠాణాలో ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు సీసీ టీవీల్లో దృశ్యాల పరిశీలించారు. చిన్నారితో సహా నుస్రత్ షాజహాన్ బేగం ఎంజీబీఎస్‌కు వెళ్లినట్లు గుర్తించారు. అక్కడ మహారాష్ట్ర బస్సు ఎక్కినట్లు తెలుసుకుని జహీరాబాద్ పోలీసులను అప్రమత్తం చేశారు. పోలీసులు తనిఖీ చేస్తారనే అనుమానంతో ఆమె సదాశివపేటలో దిగి అక్కడే ఉన్న కర్ణాటక బస్సు ఎక్కింది. అప్పటికే జహీరాబాద్ పోలీసులు బస్టాండు ఎదుట ప్రతి కర్ణాటక, మహారాష్ట్ర బస్సులను తనిఖీ చేపట్టారు. దీన్ని పసిగట్టిన సదరు మహిళ బస్సు ఆగగానే వెంటనే పాపను దాచుకుని అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించింది. అప్రమత్తమైన పోలీసులు ఆమెను నిలిపి విచారణ చేపట్టారు. వెంటనే మాదన్నపేట పోలీసులకు, చిన్నారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వీడియో కాల్‌లో పాపను చూపడంతో వారు అమరయా సిద్ధిఖీగా గుర్తించారు. వెంటనే వారు హైదరాబాద్ నుంచి జహీరాబాద్‌కు చేరుకోగా.. వివరాలు తెలుసుకొని చిన్నారిని ఎస్‌ఐ వారికి అప్పగించారు. ఎస్‌ఐతో పాటు సిబ్బందిని జహీరాబాద్ డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి, సీఐ రవిలు అభినందించారు.