గిరిజన ప్రాంత అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది.
ఓట్లు పడకపోయినా గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం.
–రూ 1005 కోట్లతో 1069 కిలోమీటర్లు రోడ్డు నిర్మాణం.
–గిరి యువత గంజాయి జోలికి పోవద్దు.
పర్యాటక పరంగా యువత ఉపాధి పొందాలి.
The coalition government is committed to the development of tribal areas: Deputy CM Pawan Kalyan.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
డుంబ్రిగుడ
ఏజెన్సీ ప్రాంతంలో కూటమి ప్రభుత్వానికి ఓట్లు పడకపోయినా గిరిజన ప్రాంత అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. మండలంలో ఆయన సోమవారం పర్యటించారు. ముందుగా పెదపాడు పీవీటి జి గ్రామంలో సందర్శించారు. ఆ గ్రామస్తులు ఆయనకు దింసా నృత్యం ప్రదర్శిస్తూ ఘనంగా స్వాగతం పలికారు. ఆ గ్రామంలోని గర్భిణీలు బాలింతలకు పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు.ఆ గ్రామస్తులతో ముఖాముఖి ద్వారా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల భవనం ,అంగన్వాడి భవనం, డ్రైనేజీ, తాగునీరు, వంతెన, సామాజిక భవనం, రచ్చబండ తోపాటు పలు సమస్యలను విన్నవించగా సమస్యలను పరిష్కరిస్తానని హామీని ఇచ్చారు. ఆ గ్రామస్తులు పండించిన చిరుధాన్యాల తో పాటు ఉత్పత్తులను స్టాల్స్ గా ఏర్పాటు చేసి డిప్యూటీ సీఎంకు వివరించారు. అనంతరం అక్కడినుంచి మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో సందర్శించి అడవి తల్లి బాట కార్యక్రమం ద్వారా పీఎం జన్మన్ పి ఎం జి ఎస్ వై ఎంజిఎన్ఆర్ఇజిఎస్ పి ఆర్ ఆర్ టిఎస్పి పథకాల ద్వారా రూ 1005 కోట్లతో 1069 కిలోమీటర్లు మారుమూల గ్రామాల్లో రోడ్లు నిర్మాణం కు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ గిరిజన మారుమూల గ్రామంలో రోడ్లు లేక ఆదివాసి గిరిజనులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, అనారోగ్యాలకు గురైన గర్భిణీలు ప్రసవాలు చేయించుకోవాలన్నా డోలిమోతలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ కష్టాలను తీర్చడానికి మారుమూల గ్రామాల్లో రోడ్లు నిర్మాణానికి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. పచ్చటి అడవి తల్లికి నమ్ముకుంటే బువ్వ పెడతాదని గిరిజన ప్రాంత అభివృద్ధికి “అడవి తల్లి బాట”పేరుతో శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. గిరిజనుల జీవనశైలి మారాలి అంటే రోడ్డు లేని గ్రామాల్లో రోడ్డు సౌకర్యం కచ్చితంగా కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. గత వైసిపి ఐదేళ్ల పాలనలో కేవలం రూ 99 కోట్లు మాత్రమే రోడ్లకు ఖర్చు పెట్టారని విమర్శించారు. మన్యం ప్రాంతంలో కూటమి ప్రభుత్వానికి ఓట్లు పడకపోయినా పార్టీలకు సంబంధం లేకుండా రోడ్డు నిర్మించడంతోపాటు పలు అభివృద్ధి పనులు చేస్తున్నామని చెప్పారు. ఏజెన్సీ మన్యం వ్యాప్తంగా సుమారు 1170 గ్రామాలకు ప్రస్తుతం రోడ్లు లేవని దశలవారీగా ఆ గ్రామాలన్నింటికీ రోడ్లు నిర్మిస్తామన్నారు. గిరిజనుల నమ్మకాన్ని ఒమ్ముచేయమని, మీకు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని చెప్పారు. అరుకు ప్రాంతంలో టూరిజం బాగా అభివృద్ధి చెందాలి గిరి యువత కూడా టూరిజం పరంగా పెట్టుబడులు పెట్టి ఉపాధి పొంది ఆర్థికంగా అభివృద్ధి చెందాలని యువతకు సూచించారు. యువత గంజాయి వ్యసనాలకు బానిసలై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, గంజాయిని సామాజిక ఆర్థిక సమస్యగా చూస్తామన్నారు. ఈ జోలికి యువత వెళ్లకుండా ఉండేందుకుగాను పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వికాస్ కార్యక్రమం పేరిట అవగాహన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా లక్ష ఎకరాల్లో కాపీ పంట సాగు చేయడానికి కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తానని చెప్పారు. కాపీ పంట సాగుతో కూడా నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. మూఢనమ్మకాలను నమ్మి చట్టన్ని ఏ ఒక్కరూ చేతుల్లో తీసుకోవద్దని సూచించారు. పర్యావరణానికి, టూరిజానికి ఇబ్బంది కలగకుండా ఉండేవిధంగా చాపరాయి జలపాతంలో బ్రిడ్జి నిర్మిస్తామని రెండు నెలల్లో పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.వచ్చే ఎన్నికల్లో మన్య ప్రాంతమంతా కూటమి పార్టీ జెండాలు రెపరెపలాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజనతో రాష్ట్రం చాలా నష్టపోయిందని మూడు పర్యాయాలు కూటమి ప్రభుత్వానికి అధికారమిస్తే రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నడిపిస్తామని చెప్పారు. అధికారం ఇచ్చిన మీకోసం ఒళ్ళుంచి పనిచేస్తామని, మీ ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుభద్ర, జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ,మాజీ మంత్రి మణికుమారి, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, జిసిసి చైర్మన్ శ్రవణ్ కుమార్, ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం జోనల్ చైర్మన్ దొన్నదొర, ఎంపీపీ జడ్పీటీసీలు సిహెచ్ జానకమ్మ,,బి ఈశ్వరి, కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.