శ్రీరాముడి స్ఫూర్తితోనే రాజ్యాంగ రూపకల్పన
ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జగిత్యాల
శ్రీరాముడి ఆదర్శవంతమైన పాలన స్ఫూర్తితోనే రాజ్యాంగం రూపొందించబడ్డదని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో అయోధ్య అక్షింతల వితరణ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లు పాల్గొన్నారు. విద్యానగర్ శ్రీ రామాలయంలో పూజల అనంతరం అయోధ్య నుండి వచ్చిన అక్షింతల కలశాలను భక్తిశ్రద్ధలతో తల పైన ఉంచుకొని వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీరాముడు ఆదర్శ పురుషుడని, ప్రజారంజక పాలకుడని తెలిపారు. తండ్రి మాటను జవదాటని ఆదర్శమూర్తి అని కొనియాడారు.తన రాజ్యంలో ఒక సామాన్య వ్యక్తి మాటకు కూడా విలువ ఇచ్చి భార్యను అడవులకు పంపాడని, ఇది తన ఆత్మను రెండుగా చీల్చడమేనని అన్నారు. శ్రీరాముని ఆదర్శవంతమైన జీవితం నేటి సమాజానికి ఎంతో అవసరమని శ్రీరాముని అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని కోరారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అయోధ్య శ్రీ రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఈనెల 22న జరగనున్న సందర్భంగా హిందూ సమాజానికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ భీమనాత్ని శంకర్, ఎస్పి సుబ్రహ్మణ్యం, డాక్టర్ వెంకట్రాజిరెడ్డి, డాక్టర్ ఆకుతోట శ్రీనివాస్ రెడ్డి, జిడిగే పురుషోత్తం, సురేందర్,అశోక్ రావు, పద్మాకర్, ఏ సి ఎస్ రాజు, అరవ లక్ష్మి, రామ్ రెడ్డి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.