ఏ ఇద్దరు కలిసినా ఆంధ్రాలో ఎవరు అధికారంలోకి వస్తారనే విషయంపైనే చర్చ
హైదరాబాద్: ఏ ఇద్దరు కలిసినా ఆంధ్రాలో ఎవరు అధికారంలోకి వస్తారనే విషయంపైనే చర్చ. ఆదివారం కదా అని ఎవరి ఇంటికి వెళ్లినా గెలుపు అవకాశాలపై చర్చలు. ఎవరికీ అందని ఓటరు నాడి పట్టుకోలేక ఫలితాల కోసం తెలుగు ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఫోన్లలో కూడా ఇవే చర్చలు. ఎక్కడకు వెళ్లినా ఎన్నికల ఫలితాలపై అంచనాలతో కాలం గడిచిపోతోంది. రాజకీయ పార్టీలకంటే లోతైన విశ్లేషణలతో ఎవరికి అధికారం దక్కుతుందనే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. శనివారంతో సాధారణ ఎన్నికలు ముగియడంతో సాయంత్రం నుంచి ప్రసారమవుతున్న ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఎంతో ఆసక్తిగా వీక్షించిన తెలుగు ప్రజలు.. ఆదివారం ఉదయం లేవగానే వార్తాపత్రికలను కూడా తిరగేసి.. గతంలో ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎంతవరకు నిజమయ్యాయి?.. ఈ సారి ఆయా సంస్థలు ఎవరికి ఎక్కువ సీట్లు వస్తాయని చెబుతున్నాయనే అంశాలపై దృష్టి సారిస్తున్నారు.
ఉదయం లేచింది మొదలు..
ఉదయం కప్పు కాఫీతో మొదలైన చర్చలు.. రాత్రి భోజనాలు ముగిసి నిద్రపోయేవరకూ కొనసాగాయి. ఇదంతా ఎందుకని మంగళవారం ఓట్ల లెక్కింపు ఉండడంతో కొంతమంది సొంత నియోజకవర్గాలకు ప్రయాణమయ్యారు. ఎప్పుడూ ఓట్లు వేయడానికి వెళ్లేవారు.. ఫలితాలను మీడియాలో వీక్షించేవారు.. ఇప్పుడు గెలుపు సంబరాలను తమవారితో చేసుకునేందుకు సొంత వాహనాలు, రైళ్లు, బస్సుల్లో తరలివెళ్లారు. ఇక్కడ నిర్మాణ రంగంలో ఉన్న వారు.. ఓట్లు వేయడానికి వెళ్లి…ఇంకా రాలేదని స్థిరాస్తి రంగం ప్రతినిధులు చెబుతున్నారు. ఇంకా రాలేదేమని తమ వద్ద కార్పెంటరీ వర్కు చేసే రామును అడిగితే ఫలితాలు వచ్చాక వస్తామని చెప్పాడని సదరు యజమాని తెలిపారు.