వైసీపీ నేతల దారెటు…
విజయవాడ, జూలై 29
The door of YCP leaders…
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి రెండు నెలకు కూడా కాకముందే అర్థం లేని అంశాలతో వైసీపీ అధ్యక్షుడు జగన్ నానా రచ్చ చేయాలని చూస్తుండటం సొంత పార్టీలోనే చర్చనీయాంశంగా మారింది. జగన్ వైఖరితో సొంత పార్టీ నేతలే తమ మనుగడ కోసం పక్కచూపులు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి కూటమి అఖండ మెజార్టీతో అధికారంలోకి వచ్చినప్పటి నుంచే వైసీపీ మనుగడపై సందేహాలు వ్యక్తమయ్యాయి.వైసీపీ బలం 151 నుంచి ఒక్కసారిగా 11కి పడిపోవడంతో ఆ పార్టీ నేతలు షాక్ అయ్యారు. ఆ క్రమంలో జగన్ అక్రమ ఆస్తుల కేసుల విచారణ వేగవంతం అవుతుండటంతో.. ఆయన భవిష్యత్తుపై నేతల్లో భయం పట్టుకున్నట్లు కనిపిస్తుంది.. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు గోడ దూకుతారన్న ప్రచారం వైరల్ అవుతోంది. ఆ విషయం గ్రహించే జగన్ కూడా వైరాగ్యం ప్రదర్శిస్తున్నారంట. ఇంటర్నల్ మీటింగ్స్‌లో పోయేవాళ్లను ఆపలేం కదా అని నిర్వేదం ప్రదర్శిస్తున్నారంట.ఎంపీ మిథున్ రెడ్డి బీజేపీలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారని.. ఆయన తండ్రి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా అటే చూస్తున్నారన్న టాక్ వినిపించింది. అధికారం శాశ్వతం అన్న ధీమాతో అయిదేళ్ల పాలనలో పెద్దిరెడ్డి అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. దానికి దగ్గట్లే ఆయన అరాచకాలు, భూకబ్జాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. వాటిపై విచారణలు కూడా మొదలవుతున్నాయి… అవి నిరూపితమైతే ఏం జరుగుతుందో తెలిసిన పెద్దిరెడ్డి బీజేపీలో చేరి సేఫ్ జోన్‌లోకి వెళ్లాలన్న ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే అంత ఖర్మ తమకు పట్టలేదని ఆ తండ్రికొడుకులు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారనుకోండి. అది వేరే విషయం.కడప ఎంపీ అవినాష్ రెడ్డి విషయంలోనూ ఇదే తరహా ప్రచారం తెరపైకి వచ్చింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడైన అవినాష్ కూడా తన అన్న జగన్‌కు హ్యాండ్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు ఊహాగానాలు చెలరేగాయి.. దాంత అవినాష్ కూడా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో మాజీ మంత్రి, జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ మినహా మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలు మొత్తాన్ని తీసుకొస్తాను.. బీజేపీలో చేర్చుకోవాలని రాయలసీమకు చెందిన ఓ పెద్ద మనిషి తనతో అన్నారని దానికి తాను ఒప్పుకోలేదని ఆదినారాయణ రెడ్డి చెప్పడం గమనార్హం.వైసీపీ నేతలపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతూ.. దానిపై విచారణలు జరుగుతున్న టైంలో అలాంటి వారిని చేర్చుకుంటే తమకు కూడా ఆ బురద అంటుతుందని ఆదినారాయణరెడ్డి లాంటి సీనియర్ అంటుండటం విశేషం. వాళ్లందరినీ చేర్చుకుంటే వాళ్లు చేసిన తప్పులకు తాము బాధ్యులం అవుతామని ఆయన అంటున్నారు. దాంతో ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో ఆది హాట్ టాపిక్‌గా మారిపోయారు.