వరంగల్, అక్టోబరు 21, (వాయిస్ టుడే): కాలం మారుతున్న.. కొందరి మూర్ఖత్వం మాత్రం మారడం లేదు. కొడుకు పుడితే ప్లస్సు, కూతురు పుడితే మైనెస్ అనే లెక్కల్లో ఉన్నారు. ఇంటి పేరు కొడుకు వల్లే నిలబడుతుందని. కూతురు వంశాన్ని పెంచలేదనే భ్రమలో బ్రతుకుతున్నారు. ప్రభుత్వం ఎన్ని అవగాహన కార్యక్రమాలను చేపట్టినా కొందరి మనుషుల మనస్తత్వాన్ని మార్చలేకపోతుంది. నవమాసాలు మోసి ప్రాణాలను పణంగా పెట్టి కన్న బిడ్డ ఆడపిల్ల అని తెలిస్తే చాలు కనికరంలేకుండా చంపేసాతున్నారు. లేదా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ అనే జాలి కూడా లేకుండా నిర్ధాక్షణంగా అనాధగా వదిలేస్తున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో కోకొల్లలు. అయితే అలాంటి ఘటనే తాజాగా మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.వివరాలల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రిలో గత పదిరోజుల క్రితం ఓ మహిళకి ఆడపిల్ల జన్మించింది. అయితే నాలుగో కాన్పులో కూడా ఆడపిల్ల పుట్టడంతో ఆ దంపతులు బాధపడ్డారు. కన్న బిడ్డ అనే మమకారం లేకపోయినా, కన్నీసం ముక్కుపచ్చలారని పసికందు, తల్లి లేకపోతే ఉండలేదు అనే జాలి కూడా లేకుండా ఆ పిసిపాపను ఆసుపత్రిలోనే వదిలేసి వెళ్లిపోయారు. దీనితో గత పది రోజుల నుండి ఆసుపత్రి సిబ్బంది ఆ పాపకు అన్ని అయ్యి అలనా పాలన చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పాప ఆరోగ్యం బాగానే ఉంది అని తెలియ చేసిన వైద్యులు బాలల సంరక్షణ భవన్ కు పాపను అప్పగిస్తామని తెలిపారు. ఈ హృదయ విదారక ఘటన అందరి మనసుల్ని కలిచి వేస్తుంది.