జూన్ 14న తెలంగాణలో గద్దర్ సినీ అవార్డులు ప్రదానోత్సం
The Gaddar Film Awards will be presented in Telangana on June 14th.
హైదరాబాద్, ఏప్రిల్ 22, (న్యూస్ పల్స్)
గత పదేళ్లుు తెలంగాణలో సినీ పరిశ్రమ నిరాధరణకు గురైందని, గద్దర్ సినిమా అవార్డుల ఫంక్షన్ నభూతో న భవిష్యత్తు అన్నట్టు జరుపుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సినిమా అవార్డుల ఫంక్షన్ కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ లోని LV ప్రసాద్ సినీ ల్యాబ్ లో మంగళవారం నాడు నిర్వహించిన గద్దర్ అవార్డుల జ్యూరీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. హెచ్ఐసీసీ వేదిగా జూన్ 14న తెలంగాణలో గద్దర్ సినీ అవార్డులు ప్రదానోత్సం చేస్తామన్నారు దిల్ రాజు.ప్రపంచ స్థాయిలో సినిమా అవార్డుల ఫంక్షన్ ఏ తీరుగా నిర్వహిస్తారో అందుకు ఏమాత్రం తగ్గకుండా తెలంగాణలో గద్దర్ సినిమా అవార్డుల కార్యక్రమం నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్లో నిర్వహించనున్న ఈ గద్దర్ చలనచిత్ర అవార్డుల ఫంక్షన్ గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకునేలా ఈవెంట్ నిర్వహించాలని కమిటీ సభ్యులు, అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి సూచించారు. గత 10 ఏళ్లలో రాష్ట్రంలో సినీ పరిశ్రమ నిరాదరణకు గురైందన్నారు. 2011లో చలనచిత్ర అవార్డుల పంపిణీ కార్యక్రమం నిలిచిపోయిన తరువాత ఇండస్ట్రీకి ప్రోత్సాహం కరువైంది అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా యుద్ధనౌక గద్దర్ పుట్టడం మన అదృష్టం అని, దశాబ్దానికి ఒకరు అలాంటి మహానుభావులు పుడతారని కొనియాడారు. తెలంగాణ సంస్కృతి, గుండె చప్పుడును విశ్వవ్యాప్తం చేసిన గొప్ప వ్యక్తి గద్దర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, భావజాలాన్ని రాష్ట్రానికి దేశానికి ప్రపంచానికి సరైన మార్గంలో గద్దర్ ప్రచారం చేశారని భట్టి విక్రమార్క వివరించారు. ఆయన బానిని చిన్నపిల్లలు నుంచి వృద్ధుల వరకు, ఆడ, మగా అనే వ్యత్యాసం లేకుండా అందరూ అనుకరించారని తెలిపారు. సింగరేణి ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర సాధన డిమాండ్ తో పాదయాత్ర చేసి గద్దర్ ప్రత్యేక రాష్ట్రానికి నాంది పలికారని గుర్తుచేశారు. ఎక్కడో మద్రాసులో ఉన్న చిత్ర పరిశ్రమను కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్కు తీసుకురావడంతో పాటు ప్రోత్సహించింది అన్నారు. చిత్ర పరిశ్రమను తరలించి ప్రోత్సాహకాలు అందించడమే కాదు, సినీ ఇండస్ట్రీలో సేవలు అందించిన వారికి ఇళ్ల స్థలాలను సైతం కేటాయించినట్లు చెప్పారు. సమాజంలో అభివృద్ధి, విలువలను ప్రోత్సహించేది మీడియానే, జర్నలిస్టులు అని.. అలాంటి మీడియాను కాపాడుకునే బాధ్యత పాలకులు, ప్రభుత్వానిపై ఉందన్నారు. బంధాలు, రాగద్వేషాలకు అతీతంగా గద్దర్ సినీ అవార్డులకు సినిమాలను ఎంపిక చేయాలని జూరీ సభ్యులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు. సినీ అవార్డులతో పాటు సినీ పరిశ్రమకు కీర్తి ప్రతిష్టలు తెచ్చిన వారి పేరిట సైతం అవార్డులు ఇస్తున్నాం, ఇవి భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలవాలన్నారు. ప్రజల జీవన ప్రమాణాల పెరుగుదలకు బాధ్యత గల ప్రభుత్వాలు బలమైన సినిమా రంగం ద్వారానే ప్రజలకు సందేశం ఇవ్వాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ క్యాబినెట్ నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్రం సాధించుకున్నాక గత దశాబ్ధం నుంచి ప్రోత్సాహానికి ఏ విధంగా నోచుకోని సినీ పరిశ్రమకు చేయూతనివ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు. గద్దర్ సినీ ఈ పురస్కారాల ఎంపిక కోసం 15 మంది సభ్యులతో జ్యూరీ ఏర్పాటు కాగా, కమిటీకి ఛైర్మన్గా నటి జయసుధను ఎంపిక చేశారు. అవార్డుల కోసం అన్ని విభాగాల్లో 1248 నామినేషన్లు వచ్చాయి. వ్యక్తిగత విభాగంలో 1172, ఫీచర్ ఫిల్మ్, డాక్యుమెంటరీ, ఫిల్మ్ క్రిటిక్స్, చిల్డ్రన్ ఫిల్మ్స్, పుస్తకాలు ఇతర కేటగిరిల్లో 76 దరఖాస్తులు అందాయని తెలిపారు. నామినేషన్లకు దరఖాస్తులను ప్రస్తుతం జ్యూరీ సభ్యులు పరిశీలిస్తున్నారని సమాచారం.



