ప్రపంచవ్యాప్తంగా మున్నూరు కాపులను ఏకం చేయడమే లక్ష్యం: జీఎంఏ వ్యవస్థాపక చైర్మన్ వెంకట్ పెద్ది
The goal is to unite Munnuru Kapus across the globe: GMA Founding Chairman Venkat Peddi


హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో నివసిస్తున్న మున్నూరు కాపు సమాజ బాంధవులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, వారికి సామాజిక, ఆర్థిక, వైద్య, న్యాయ, వృత్తిపరమైన సహాయ సహకారాలు అందించడమే గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ (జీఎంఏ) ప్రధాన లక్ష్యమని సంస్థ వ్యవస్థాపక చైర్మన్ వెంకట్ పెద్ది తెలిపారు.
తెలంగాణ మున్నూరుకాపు జర్నలిస్ట్స్ ఫోరం ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎర్రమంజిల్‌లోని హోటల్ మెర్కూర్‌లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరైన వెంకట్ పెద్ది మాట్లాడుతూ, అమెరికాతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల్లో నివసిస్తున్న మున్నూరు కాపు కుటుంబాలకు అండగా నిలిచేందుకు జీఎంఏను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అమెరికాలో నిర్వహించిన జీఎంఏ తొలి కన్వెన్షన్‌కు 2,500 మందికి పైగా హాజరై విజయవంతం చేశారని, ప్రస్తుతం సంస్థలో 3 వేల మందికి పైగా సభ్యులు ఉన్నారని వివరించారు. విదేశాల్లో నివసిస్తున్న మున్నూరు కాపులకు అనుకోని కష్టాలు ఎదురైనప్పుడు తక్షణ సహాయం అందించేలా జీఎంఏ పనిచేస్తోందన్నారు.
కష్టకాలంలో అండగా జీఎంఏ
కోవిడ్ సమయంలో తండ్రిని కోల్పోయి విదేశాల్లో చిక్కుకుపోయిన ఓ మున్నూరు కాపు యువతికి సంబంధిత కాన్సులేట్ జనరల్ అధికారులతో మాట్లాడి, అర్ధరాత్రి సమయంలోనే వీసా స్టాంపింగ్ ఏర్పాట్లు చేయించి స్వదేశానికి పంపేందుకు సహకరించిన విషయాన్ని వెంకట్ పెద్ది గుర్తుచేశారు.
సమాజానికి చెందిన ఏ ఒక్కరికైనా కష్టకాలంలో అండగా నిలవడమే జీఎంఏ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. భవిష్యత్తులో సంస్థను మరింత ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేసేందుకు లీగల్, బిజినెస్ ఫోరమ్‌లను విస్తరించాల్సిన అవసరం ఉందని అన్నారు.
సమాజంలోని ప్రతిభావంతులు, వ్యాపారవేత్తలు, న్యాయవాదులు, వైద్యులు, విద్యార్థులు, యువతతో పాటు వివిధ రంగాల్లో ఉన్న వారందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి పరస్పర సహకారాన్ని పెంచేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
జీఎంఏ వెబ్‌సైట్ ద్వారా మ్యాట్రిమోనియల్ సేవలు, విద్యార్థులు–యువతకు ఉద్యోగ అవకాశాల సమాచారం, డాక్టర్స్ గ్రూప్ ద్వారా వైద్య సహాయం, లీగల్ నెట్‌వర్క్ ద్వారా న్యాయ సహాయం వంటి పలు ఉచిత సేవలను అందిస్తున్నట్లు వెల్లడించారు.
విదేశాల్లో స్థిరపడుతున్న మున్నూరు కాపు కుటుంబాలకు, ముఖ్యంగా అక్కడ పెరుగుతున్న తదుపరి తరానికి అవసరమైన మార్గదర్శకత్వం, సామాజిక అనుసంధానం, సహకారం అందించేలా జీఎంఏను మరింత విస్తరించనున్నట్లు చెప్పారు. సమాజానికి చెందిన ప్రతి ఒక్కరూ జీఎంఏలో భాగస్వాములై సంస్థ కార్యకలాపాలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
మానవాభివృద్ధిపైనే దృష్టి పెట్టాలి
సీనియర్ జర్నలిస్ట్ సుంకరి శ్రీరామ్ మూర్తి మాట్లాడుతూ కేవలం భవనాలు, ఫ్లైఓవర్లు, విమానాశ్రయాలు నిర్మించడమే అభివృద్ధి కాదని, మానవాభివృద్ధి సూచికలు పెరిగినప్పుడే సమాజం నిజమైన ప్రగతి సాధించినట్లు భావించాలని అన్నారు.
సమాజంలో వెనుకబడిన వర్గాలు ముందుకు రావాలంటే విద్య, వైద్యం, ఆర్థిక స్థితిగతులు, ఉపాధి అనే నాలుగు కీలక అంశాలపై దృష్టి సారించాలని సూచించారు.
ఒకప్పుడు ఐక్యతకు మారుపేరుగా ఉన్న మున్నూరు కాపు సమాజం గత 15–20 ఏళ్లలో వివిధ రాజకీయ పార్టీలుగా విడిపోవడం వల్ల సరైన ప్రాతినిధ్యం కోల్పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, డబుల్ బెడ్రూం ఇళ్లు, కుట్టు మిషన్ల పంపిణీ తదితర ప్రభుత్వ పథకాల ఫలాలు సమాజంలోని అర్హులైన ప్రతి పేద కుటుంబానికి చేరేలా నెట్‌వర్కింగ్‌ను మరింత బలోపేతం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో జర్నలిస్టులు నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటూ తమను తాము అప్‌డేట్ చేసుకోవాలని, అర్హత కలిగిన జర్నలిస్టులుగా గుర్తింపు పొందేందుకు జర్నలిజం కోర్సులను ఎంచుకుని నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు.
‘పటేల్’ గుర్తింపును బలోపేతం చేయాలి
తెలంగాణ మున్నూరు కాపు జర్నలిస్ట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కొత్త లక్ష్మణ్ పటేల్ మాట్లాడుతూ మున్నూరు కాపు సమాజ ఐక్యత, సామాజిక గుర్తింపు కోసం ‘పటేల్’ అనే పదాన్ని విస్తృతంగా ప్రచారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు.
మున్నూరు కాపు సామాజిక వర్గంలో దాదాపు 70 నుంచి 80 శాతం మంది ‘పటేల్’ గుర్తింపును ఇప్పటికే ఆమోదించి, సోషల్ మీడియాతో పాటు వివిధ సర్టిఫికెట్లలో ఉపయోగిస్తున్నారని తెలిపారు. ఇతర సమాజాలు కూడా ఈ గుర్తింపును అంగీకరిస్తున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ‘పటేల్’ పద వినియోగాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
యువతలో అవగాహన పెంచేందుకు పటేల్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో మూడుసార్లు జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహించామని, వాటికి జీఎంఏ పూర్తి సహకారం అందించిందని గుర్తుచేశారు.
తెలంగాణలోని మున్నూరు కాపుల మూలాలు, ప్రాంతాలవారీగా ఉన్న సంస్కృతి, చారిత్రక పరిణామాలపై ప్రత్యేక పరిశోధన చేపట్టి త్వరలోనే ప్రత్యేక సంచికగా ఒక పుస్తకాన్ని వెలువరించనున్నట్లు ప్రకటించారు.
ఉమ్మడి కరీంనగర్, వరంగల్, మెదక్, నిజామాబాద్ తదితర జిల్లాల్లో మున్నూరు కాపు సామాజిక వర్గం బలంగా ఉన్నప్పటికీ, రాజకీయ నాయకులు ఎన్నికల్లో గెలిచిన తర్వాత కుల ప్రస్తావన చేయడానికి వెనకాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజానికి చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులకు తగిన గుర్తింపు లభించేలా ప్రచారం కల్పించాల్సిన బాధ్యత జర్నలిస్టులపై ఉందన్నారు.
దుబాయిలో త్వరలో మున్నూరు కాపుల సమ్మేళనం
జీఎంఏ వ్యవస్థాపక సభ్యుడు, గ్లోబల్ కనెక్ట్ చైర్ రజినీకాంత్ సంగాని వీడియో సందేశం ద్వారా మాట్లాడుతూ త్వరలో దుబాయిలో మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్లు తెలిపారు.
తెలంగాణలో మున్నూరు కాపుల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని, యువతకు వృత్తి నైపుణ్య శిక్షణ కోసం తోడ్పాటునందిస్తామని చెప్పారు. ముఖ్యంగా జర్నలిస్టులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
విదేశాల్లో ఉన్న మున్నూరు కాపు కుటుంబాలకు, ముఖ్యంగా భవిష్యత్ తరాలకు జీఎంఏ ఒక బలమైన వేదికగా, కొండంత భరోసాగా నిలుస్తుందని అన్నారు. సమాజ అభివృద్ధి, ఐక్యత కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మున్నూరు కాపులంతా పరస్పర సహకారంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఆత్మీయ వాతావరణంలో జర్నలిస్టుల సమ్మేళనం
ఉత్సాహభరితమైన, ఆత్మీయ వాతావరణంలో సాగిన ఈ సమావేశంలో ప్రముఖ సీనియర్ జర్నలిస్టులు సుంకరి శ్రీరామ్ మూర్తి, తులైల శ్రీనివాస్, తెలంగాణ విఠల్, మ్యాడం మధు, నేతాజీ, గారా రాఘవరావు, గోపాల రమేష్, విద్యాసాగర్, పోలంపల్లి నాగ చంద్రకాంత్, ఆకుల మహేష్, ఆకుల రవీందర్, జనార్ధన్, రమేష్, సంపత్, దోనేటి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మున్నూరు కాపు జర్నలిస్టుల మధ్య ఐక్యత, పరస్పర సహకారం, వృత్తిపరమైన అభివృద్ధి, జర్నలిస్టుల సంక్షేమం, యువ జర్నలిస్టులకు మార్గదర్శకత్వం, సమాజ సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీడియా పాత్ర వంటి అంశాలపై చర్చించారు.
దోనేటి బాలకృష్ణ, చిన్న పత్రికల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా, తుఫాన్ డైలీ న్యూస్ పేపర్ ఎడిటర్‌గా జర్నలిజం రంగంలో అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా పలువురు అభినందించారు.
సమాజ అభ్యున్నతి, జర్నలిస్టుల సంక్షేమం, ప్రపంచవ్యాప్తంగా మున్నూరు కాపుల మధ్య సమన్వయం కోసం భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని సమావేశంలో పలువురు ఆకాంక్షించారు.




