దిల్లీ: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో భాజపా , కాంగ్రెస్ లు అభ్యర్థుల ఖరారు ప్రక్రియలో వేగం పెంచాయి. ఇప్పటికే తొలి జాబితాను విడుదల చేసిన ఈ పార్టీల నేతలు.. సోమవారం మరోసారి సమావేశమయ్యారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో సమావేశమైన భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ (CEC).. తాజా చర్చల్లో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, హరియాణా సహా ఆయా రాష్ట్రాల్లోని స్థానాలపై దృష్టి సారించినట్లు సమాచారం.
సమావేశానికి ముందు హరియాణా ఉప ముఖ్యమంత్రి, జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) నేత దుష్యంత్ చౌతాలా.. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిపారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి మొత్తం 10 ఎంపీ స్థానాలను భాజపా కైవసం చేసుకుంది. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కమలదళంతో జేజేపీ పొత్తు కుదుర్చుకుంది. ఇదిలా ఉండగా.. భాజపా మొదటి విడత జాబితాలో 16 రాష్ట్రాల్లో 195 సీట్లకుగానూ అభ్యర్థులను ప్రకటించింది. పశ్చిమ బెంగాల్‌లోని ఆసన్‌సోల్ నుంచి భోజ్‌పురి గాయకుడు పవన్ సింగ్, ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారాబంకీ నుంచి ఉపేంద్ర రావత్‌లు బరిలో నిలిచేందుకు నిరాకరించారు.
మరోవైపు, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన నిర్వహించిన సీఈసీ సమావేశంలో తొలుత ఉత్తరాఖండ్‌లోని ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ భేటీకి సోనియా గాంధీతో పాటు కుమారి సెల్జా తదితర నేతలు హాజరయ్యారు. 39 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను హస్తం పార్టీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇప్పటికే తొలి జాబితాను విడుదల చేసిన ఈ పార్టీల నేతలు..
- Advertisement -
- Advertisement -