‘ప్రవాసీ ప్రజావాణి’ విజ్ఞప్తుల కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్
The minister launched the ‘Pravasi Prajavani’ appeal center
జగిత్యాల
గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల కోసం హైదరాబాద్ బేగంపేట లోని మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో ‘ప్రవాసి ప్రజావాణి’ ప్రత్యేక కౌంటర్ ను హైదరాబాద్ ఇంఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం ప్రారంభించారు. గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడుతున్న వారి సంబంధీకులు, గల్ఫ్ మృతుల కుటుంబ సభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్ కు వినతిపత్రాలు సమర్పించారు. ప్రతి మంగళ, శుక్ర వారాలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు ప్రవాసీ ప్రజావాణి నిర్వహిస్తారు. మంత్రితో పాటు ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి. చిన్నారెడ్డి, టీపీసీసీ ఎన్నారై సెల్ చైర్మన్ అంబాసిడర్ డా. బిఎం వినోద్ కుమార్ లు గల్ఫ్ బాధిత కుటుంబాల సమస్యలను విన్నారు. టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి గల్ఫ్ కార్మిక కుటుంబాలకు మంత్రి బృందానికి అనుసంధానకర్తగా వ్యవహరించారు. ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్యా దేవరాజన్, కాంగ్రేస్ పార్టీ ఎన్నారై విభాగం ప్రతినిధులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, నంగి దేవేందర్ రెడ్డి, చెన్నమనేని శ్రీనివాస్ రావు, చాంద్ పాషా, బొజ్జ అమరేందర్ రెడ్డి, గల్ఫ్ జెఏసి నాయకులు గుగ్గిల్ల రవిగౌడ్, స్వదేశ్ పరికిపండ్ల, తోట ధర్మేందర్, బషీర్ అహ్మద్, దీకొండ కిరణ్, గుయ్య సాయిక్రిష్ణ, బూత్కూరి కాంత, బిఎల్ సురేంద్రనాథ్, పోతుగంటి సాయిందర్, ఎన్నారైలు జబ్బార్, శాంతిప్రియ యాదవ్, జీఏడీ ఎన్నారై అధికారులు హరీష్, చిట్టి బాబు, ‘టాంకాం’ మేనేజర్ షబ్నం, పిఓఇ కార్యాలయ ప్రతినిధి సుధాకర్, రిక్రూటర్స్ ప్రతినిధి చీటీ సతీష్ రావు, నాయకులు పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, అనంతుల శ్యామ్ మోహన్, బి. కమలాకర్ రావు, సిస్టర్ లిజీ జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు.
2023 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం… ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తమ ప్రభుత్వం గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల సంక్షేమం గురించి కట్టుబడి ఉన్నదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ మేరకు గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపు, గల్ఫ్ కార్మికుల స్థితిగతుల అధ్యయనానికి అడ్వైజరీ కమిటీ ఏర్పాటు, ప్రజా భవన్ లో కొనసాగుతున్న ప్రజావాణి కార్యక్రమంలో గల్ఫ్ కార్మికుల కుటుంబాల కోసం ప్రత్యేకంగా ‘ప్రవాసి ప్రజావాణి’ కౌంటర్ ఏర్పాటు, ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్ల అడ్మిషన్లలో గల్ఫ్ కార్మికుల పిల్లలకు ప్రాధాన్యం ఇస్తూ తమ ప్రభుత్వం జీవో జారీ చేసిందని మంత్రి అన్నారు.
ఉత్తర తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, గల్ఫ్ వలసల నిపుణులు, ప్రవాసీ సంఘాల నాయకులతో గల్ఫ్ కార్మికుల సంక్షేమం, ఎన్నారై పాలసీ రూపకల్పనకు అడ్వయిజరీ కమిటీ ఏర్పాటు చేస్తామని మంత్రి ప్రభాకర్ అన్నారు. తన స్వంత అసెంబ్లీ నియోజకవర్గం హుస్నాబాద్ లో జాబ్ మేళా నిర్వహిస్తే 9 వేల మంది హాజరయ్యారని, స్థానికంగా ఉపాధి కల్పించడం అవసరమని అన్నారు. గల్ఫ్ దేశాలకు ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో మోసాలకు పాల్పడే ఎజెంట్లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఆరు అరబ్ గల్ఫ్ దేశాలు, మలేసియా తో సహా 18 ఈసీఆర్ దేశాలలో పనిచేసే తెలంగాణ ప్రవాసీ కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మంత్రి ప్రభాకర్ అన్నారు. ఫెడరల్ వ్యవస్థలో విదేశీ వ్యవహారాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం అయినప్పటికీ తమ ప్రభుత్వం ప్రవాసి కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తుందని అన్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో, విదేశాలలోని ఇండియన్ ఎంబసీ లతో తెలంగాణ ప్రభుత్వం సమన్వయం చేస్తూ ప్రవాసులను ఒక వారధిగా పని చేస్తుందని ఆయన అన్నారు.
గత పదేళ్ళలో మన గల్ఫ్ కార్మికులు ఒక లక్షా 20 వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని తెలంగాణాకు పంపి మన ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కృషి చేశారని ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల సంక్షేమాన్ని విస్మరించిందని అన్నారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి సెప్టెంబర్ 17 లోగా జీవో విడుదల చేయడం హర్షించదగ్గ విషయమని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జి. చిన్నారెడ్డి, టీపీసీసీ ఎన్నారై సెల్ చైర్మన్ అంబాసిడర్ డా. బిఎం వినోద్ కుమార్ లు అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవాల కార్యక్రమాల వలన చాలా మంది ఎమ్మెల్యేలు, నాయకులు ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు.