మోదీ మోడల్ రాజకీయ శాస్త్రం
The Modi Model of Political Science
ప్రధాని నరేంద్ర మోదీ అరుదైన మైలురాయిని చేరుకున్నారు. మనదేశంలో సుదీర్ఘకాలం పాటు ప్రభుత్వాధినేతగా వ్యవహరించిన రికార్డును ప్రధాని మోదీ సొంతం చేసుకున్నారు. సిక్కిం మాజీ సీఎం పవన్ కుమార్ చామ్లింగ్ రికార్డును మోదీ ఆదివారంతో అధిగమించారు. సీఎంగా 8,930 రోజుల పాటు సేవలను అందించిన రికార్డు పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉన్న రికార్డును మోదీ బద్దలు కొట్టారు. గుజరాత్ సీఎంగా, దేశ ప్రధానిగా ప్రభుత్వాధినేత హోదాలలో నరేంద్ర మోదీ 8,931 పనిదినాలను పూర్తి చేసుకుని అరుదైన భారత రాజకీయ వేత్తగా నిలిచారు. దీర్ఘకాలం పాటు గుజరాత్ సీఎంగా వ్యవహరించిన రికార్డు నరేంద్రమోదీ పేరిట ఉంది. సీఎంగా సేవలు అందించే అవకాశం ఆయనకు నాలుగుసార్లు లభించింది. 2001 అక్టోబరు 7 నుంచి 2002 డిసెంబరు 22 వరకు, 2002 డిసెంబరు 22 నుంచి 2007 డిసెంబరు 22 వరకు, 2007 డిసెంబరు 23 నుంచి 2012 డిసెంబరు 20 వరకు, 2012 డిసెంబరు 20 నుంచి 2014 మే 22 వరకు నాలుగు దఫాలు ఆయన సీఎంగా వ్యవహరించారు.
2014 నుంచి మోదీ వరుసగా మూడు పర్యాయాలు దేశ ప్రధానిగా ఎన్నికయ్యారు..
గెలుపును అలవాటుగా చేసుకున్న నాయకుడు
ప్రజాస్వామ్యంలో రాజకీయ గెలుపు సాధించడమే అంతికాదని నిరూపించిన నాయకుడు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ. అధికారాన్ని సుస్థిర పరచడం అత్యంత నైపుణ్యమని ఆయన ప్రతీసారి నిరూపిస్తూ వచ్చారు. అధికారాన్ని సంపాదించడం కంటే, దాన్ని స్థిరపరుచుకోవడంలోనే నాయకుడి అసలైన సామర్థ్యం బయటపడుతుందన్నది రాజకీయ నానుడి. ఆ విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎప్పుడు సక్సెస్ అవుతూనే.. ప్రత్యర్థులను ఆశ్చర్యానికి గురి చేస్తూ వస్తున్నారు. నరేంద్రమోదీ ప్రస్థానం ఒక నిర్మిత రాజకీయ ప్రయోగశాల. పరిస్థితులను అర్థం చేసుకోవడం, వాటిని రాజకీయంగా మల్చుకోవడంలో ఆయన్ను మించిన భారత రాజకీయ వేత్తల్లో సాటిలేరన్నది విశ్లేషకుల అభిప్రాయం. గుజరాత్‌లో అధికార బాధ్యతలు చేపట్టిన తొలి దశలోనే ఆయన తన శైలిని స్పష్టంగా ప్రకటించారు. సంక్షోభాన్ని ఎదుర్కొనే నాయకుడిగానే కాకుండా, సంక్షోభాన్ని అవకాశంగా మలిచే వ్యూహకర్తగా ముందుకొచ్చారు. పునర్నిర్మాణాన్ని పరిపాలనా చర్యగా కాకుండా, అభివృద్ధిగా మలచడం ద్వారా ఆయన ఒక కొత్త రాజకీయ వైఖరిని సృష్టించారు. ఆయన గుజరాత్‌లో సాధించి పెట్టిన అభివృద్ధి బ్రాండ్.. బీజేపీకి దేశ వ్యాప్తంగా మరెంతో కీర్తిని తెచ్చిపెట్టింది. దేశవ్యాప్తంగా “గుజరాత్ మోడల్” ప్రచారంలోకి వచ్చింది. నరేంద్రమోదీ దేశ రాజకీయాల్లోకి ప్రవేశంతోనే వైబ్రేషన్ మొదలైంది. గుజరాత్‌లో 12 ఏళ్లు సీఎంగా పనిచేసిన అనుభవం.. ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చిన తీరు కలగలిసి 2014ఎన్నికల్లో బీజేపీకి పెద్ద ఆస్తిగా మారాయి. పాత రాజకీయాలతో విసిగిపోయిన ఓటరుకు కొత్త ఆశగా, వ్యవస్థపై అసంతృప్తి ఉన్న వర్గాలకు కొత్త అవకాశంగా తనను తాను ప్రతిష్టించుకోవడంలో మోదీ సక్సెస్ అయ్యారు. ఫలితంగానే 2014లో జరిగిన దేశ రాజకీయ మార్పునకు కారణమైంది. మోదీ రాజకీయ ప్రయాణాన్ని పరిశీలిస్తే, అది ఒక నిరంతర రూపాంతర క్రమంలా కనిపిస్తుంది. ఒక దశలో భావోద్వేగాల ప్రతినిధిగా, మరొక దశలో అభివృద్ధి శిల్పిగా, ఇంకొక దశలో జాతీయ గర్వానికి ప్రతీకగా కనిపిస్తారు. ఈ రీ-బ్రాండింగ్ సామర్థ్యమే ఆయనను ఒక వ్యక్తి నుంచి ఒక రాజకీయ ప్రబల శక్తిగా మార్చిదని చెప్పాలి.
సాహసం.. సర్దుబాటు
– మోదీ రాజకీయ సమీకరణం
మోదీ నిర్ణయాల స్వభావాన్ని గమనిస్తే, అవి తరచుగా సాహసోపేతంగా కనిపిస్తాయి. ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ నిషేధం, అయోధ్యలో రామమందిర నిర్మాణం ఇవన్నీ భావోద్వేగాలతో ముడిపడిన, రాజకీయంగా క్లిష్టమైన అంశాలు. కానీ ఇక్కడ ఆయన ప్రత్యేకత కేవలం నిర్ణయం తీసుకోవడంలో కాదు; దాన్ని సమయోచితంగా అమలు చేయడంలో ఉంది. అదును చూసి దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆపరేషన్ సింధూరు, సర్జికల్ స్ట్రైక్ గొప్ప ఉదాహరణలు. అవసరమైతే వెనక్కి తగ్గే సమయోచిత సర్దుబాటు.. సందర్భాలను మోదీ ప్రదర్శించిన తీరు రాజకీయ నైపుణ్యతకు నిదర్శనం. రైతు చట్టాల ఉపసంహరణ ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఎన్నికల్లొచ్చిన్నప్పుడే జనంతో కలిసి పోవడం అనే దానికి మోదీ మోడల్ రాజకీయం విరుద్ధం. పార్టీ నిలదొక్కుకోలేని దక్షిణాదిలో కూడా ఆయన ఎన్నికల సమయంలో విస్తృతంగా ప్రచారం చేస్తూ వస్తున్నారు. ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఫలితాలు సానుకూలంగా వస్తాయనేదానికి బీజేపీ ఈశాన్య భారతంలో సాధించిన విజయమే మంచి ఉదాహరణగా చెప్పవచ్చు. ఎన్నికలను ఒత్తిడిగా కాకుండా, అవకాశంగా మలచడం మోదీ ప్రత్యేకతగా చెప్పవచ్చు.
కమ్యూనికేషన్.. కనెక్షన్..
మోదీ విజయానికి మూలమైన మరో స్తంభం కమ్యూనికేషన్. రాజకీయాల్లో సందేశం ఎంత ముఖ్యమో, దాన్ని ఎలా చేరవేయాలో తెలిసి ఉండటం అంతకంటే ముఖ్యం. ఈ రెండింటినీ సమన్వయం చేయడంలో ఆయన చూపిన నైపుణ్యం ప్రత్యేకంగా నిలుస్తుంది. సోషల్ మీడియాను ఆయుధంగా మలచుకోవడం, ప్రత్యక్షంగా ప్రజలతో సంభాషించడం వంటి వ్యూహాలు..అనుసంధాన వ్యవస్థలు మోదీని జనంతో ఇంటారాక్ట్ చేసేలా చేశాయి. ప్రజల్లో “మనవాడే” మన మోదీ అనే అనే భావనను కలిగించాయి.
ఈ బంధం పార్టీ మద్దతుదారులతోనే కాక.. విభిన్న అభిప్రాయాలున్న వర్గాల్లో కూడా ఆయనపై సానుకూలత ఉండటానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. యువతను ఆకర్షించడం కూడా ఈ కమ్యూనికేషన్ వ్యూహంలో భాగమే. పాత రాజకీయ ఇమేజ్‌ను పక్కనబెట్టి, డిజిటల్ యుగానికి సరిపోయే నాయకుడిగా తనను ప్రతిష్ఠించడం ద్వారా ఆయన కొత్త ఓటర్ బేస్‌ను నిర్మించుకున్నారు. మోదీ రాజకీయ శైలిని గమనిస్తే “పరిస్థితులను అనుసరించడం కాదు, పరిస్థితులను ప్రభావితం చేయడం”.అనేది సుస్పష్టమవుతుంది. సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగడం అనేది యాదృచ్చికం ఫలితాల్లో సానుకూలత వ్యవహారం కాదు. మోదీ స్టైల్‌ను గమనిస్తే పక్కా ప్రణాళిక.. అదే స్థాయిలో రాజకీయ నిర్వహణ ఉండటమని అర్థమవుతుంది. పార్టీ నిర్మాణాన్ని విస్తరించడం, కొత్త వర్గాలను చేర్చుకోవడం, సంప్రదాయ రాజకీయ పరిమితులను అధిగమించడం ఇవన్నీ ఆయన నాయకత్వంలో కనిపించే అంశాలు. ఒక్క విజయంతో సంతృప్తి చెందకుండా, విజయాన్ని అలవాటుగా మార్చుకోవడం అదే ఆయన రాజకీయ తత్వం. గెలవడం కాదు, గెలుపును పునరావృతం చేయడం ముఖ్యం అన్నది మోదీ మోడల్ పొలిటికల్ థియరీని గమనిస్తే అర్థమవుతుంది. మోదీ ప్రస్థానం ఒక సాధారణ రాజకీయ ప్రయాణం కాదు.. అది ఆధునిక భారత రాజకీయాల్లో ఒక నమూనాగా నిలిచిపోతుంది.



