మహబూబ్ నగర్, అక్టోబరు 1, (వాయిస్ టుడే): మహబాబ్‌నగర్‌లో బీజేపీ ప్రజాగర్జన సభ జరిగింది. బీజేపీ ప్రజాగర్జన సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. సభావేదిక పైనుంచి పలు అభివృద్ధి పనులకు ప్రధాని శ్రీకారం చుట్టారు. వరంగల్-ఖమ్మం-విజయవాడ హైవే పనులకు మోదీ శంకుస్థాపన చేశారు. కృష్ణపట్నం-హైదరాబాద్ మల్టీ ప్రొడక్ట్ పైప్‌లైన్‌ను ప్రారంభించారు. రూ.2,457 కోట్లతో నిర్మించిన సూర్యాపేట-ఖమ్మం హైవేకు మోదీ శ్రీకారం చుట్టారు. జక్లేర్-కృష్ణ కొత్త లైన్ జాతికి అంకితం చేశారు. కాచిగూడ-రాయచూర్-కాచిగూడ డెమో సర్వీస్ ప్రారంభించారు. హసన్-చర్లపల్లి హెచ్‌పీసీఎల్ ఎల్పీజీ పైప్‌లైన్ జాతికి అంకితం చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భవనాలు వర్చువల్‌గా ప్రారంభించారు.కేంద్రం చేపట్టిన ఈ పనులతో ఎంతో మందికి ఉపాధి కలుగుతుందన్నారు ప్రధాని. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల చట్టం తెచ్చుకున్న విషయాన్ని గుర్తు చేశారు.

తెలంగాణలో ఎన్నో జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టామని.. హైవేల నిర్మాణంతో అన్ని రాష్ట్రాలతో తెలంగాణకు అనుసంధానం పెరిగిందన్నారు. ప్రస్తుతం చేపట్టిన ప్రాజెక్టులతో మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ మధ్య అనుసంధానం పెరుగుతుందన్నారు. దేశంలో నిర్మించే 5 టెక్స్‌టైల్ పార్కుల్లో తెలంగాణకు ఒకటి కేటాయించినట్లు మోదీ చెప్పారు. హనుమకొండలో నిర్మించే టెక్స్‌టైల్ పార్క్‌తో వరంగల్, ఖమ్మం ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ఈ సందర్భంగా తెలంగాణపై వరాలు కురిపించారు ప్రధాని మోదీ. తెలంగాణకు పసుపు బోర్డు ప్రకటించారు. పసుపు రైతుల కోసం నేషనల్ టర్మరిక్ బోర్డు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కరోనా తర్వాత పసుపు గొప్పదనం ప్రపంచమంతటికి తెలిసిందన్నారు. కరోనా తర్వాత పసుపు పంటపై పరిశోధనలు పెరిగాయన్నారు. రాష్ట్ర పసుపు రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నట్లు ప్రధాని స్పష్టం చేశారు. ములుగు జిల్లాలో సమ్మక్క-సారలమ్మ పేరుతో 900 కోట్లతో గిరిజన యూనివర్శిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ స్థాయి పెంచుతున్నట్లు చెప్పారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ కింద హెచ్‌సీయూ చేస్తున్నట్లు తెలిపారు.తెలంగాణకు అండగా ఉంటామని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారని కిషన్‌రెడ్డి తెలిపారు. రైల్వేలు, హైవేల నిర్మాణంలో రాష్ట్రానికి కేంద్రం అండగా ఉందన్నారు. ఎరువులపై సబ్సీడి రూపంలో రైతులకు కేంద్రం వేల కోట్లు ఇస్తోందన్నారు. జాతీయ రహదారుల నిర్మాణం కోసం కేంద్రం రూ.30 వేల కోట్లు కేటాయించిందన్నారు. హైదరాబాద్ చుట్టూ కేంద్రం నిర్మించే రీజనల్ రింగ్‌రోడ్డుతో రాష్ట్రం రూపురేఖలు మారతాయన్నారు. రీజనల్ రింగ్‌రోడ్డు చుట్టూ రైల్వే లైన్ కూడా నిర్మించాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. రీజనల్ రింగ్‌రోడ్డు కోసం కేంద్రం రూ.26 వేల కోట్లు కేటాయించిందన్నారు. తెలంగాణకు కేంద్రప్రభుత్వం ఏమీ ఇవ్వలేదని దుష్ప్రచారం చేస్తున్నారని కిషన్‌రెడ్డి తెలిపారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని వస్తే సీఎం కేసీఆర్ ప్రధానిని కూడా కలవటం లేదన్నారు. సీఎం కేసీఆర్ వైఖరితో తెలంగాణ నష్టపోతోందన్నారు.