బీఆర్ఎస్ కార్మిక విభాగ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్ రెడ్డి
సికింద్రాబాద్,అక్టోబర్ 31(వాయిస్ టుడే ప్రతినిధి): ఓటమి భయంతోనే కాంగ్రెస్ పార్టీ హత్యారాజకీయాలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్ రెడ్డి మండిపడ్డారు. మెదక్ పార్లమెంట్ సభ్యుడు, దుబ్బాక నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండించారు. ఇలాంటి కుట్ర రాజకీయాలకు పాల్పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అవసరమైతే ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలని విపక్షాలకు హితవు పలికారు. మృదుస్వభావి, సామ్యులు అయిన కొత్త ప్రభాకర్రెడ్డి రెండు సార్లు ఎంపీగా గెలిచి, మూడోసారి ఎమ్మెల్యేగా బరిలోకి దిగితే దాడి చేయడం హేయమని అన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, నిందితులకు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దోషులు ఏ స్థాయి వారైనా వదలకూడదని కోరారు. కాంగ్రెస్ పార్టీ రక్తచరిత్రతో అనునిత్యం రాష్ట్రాన్ని అల్లకల్లోల పరిచి, ఆర్ధికంగా అస్థిరపరిచి రాజకీయ పబ్బం గడుపుకుంటోందని దుయ్యబట్టారు. అధికారం కోసం అడ్డదారులు తొక్కుతున్న కాంగ్రెస్ పార్టీకి అది అందని ద్రాక్షేనని అర్ధమై, నీచ రాజకీయాలకు తెరతీసిందని ధ్వజమెత్తారు. నిజమైన కాంగ్రెస్ వాదులంతా ఆ పార్టీని వీడిపోవడంతో రేవంత్ బ్యాచ్కు ఓటమి తప్పదని అర్థమైందని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ కుటిల రాజకీయాలు రాష్ట్రాన్ని కబలించకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీని కనుచూపుమేరలో లేకుండా తరిమేసేందుకు ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.