ఓనర్ కక్కుర్తే….. ప్రాణాలు బలి
మార్కాపురం, ఏప్రిల్ 2
The Owner’s Greed… Claims Lives
మార్కాపురం బస్సు ప్రమాదంలో 14 మంది మృతికి ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని తేలింది. కండిషన్ లేని బస్సును లైసెన్స్ లేని క్లీనర్‌తో నడిపించడం వల్ల ఈ ఘోరం జరిగిందని పోలీసుల
విచారణలో గుర్తించారు. బస్సు మూడుసార్లు ఆగిపోయినా.. యజమాని స్పందించకపోవడం, ప్రమాదం తర్వాత తానే నడిపానని అబద్ధం చెప్పడం విచారణలో వెల్లడైంది. డ్రైవర్‌కు లైసెన్స్ లేకపోవడంతో ఇన్సూరెన్స్
రాదన్న బీమా సంస్థల ప్రకటనతో బాధితులు ఆందోళన చెందుతున్నారు.మార్కాపురం జిల్లా రాయవరం వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటనలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రమాదానికి
ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం అడ్డగోలు నిర్లక్ష్యమే కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. బస్సు కండిషన్ సరిగ్గా లేదని తెలిసినా.. ఓనర్ కక్కుర్తి, లాభాపేక్షతో లైసెన్స్ లేని వ్యక్తితో బస్సు నడిపించి 14 మంది
అమాయకుల ప్రాణాలను బలిగొన్నట్లు పోలీసులు గుర్తించారు. నిబంధనలను తుంగలో తొక్కి ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడిన ట్రావెల్స్ యజమానిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాజగిత్యాల జిల్లా నుంచి
ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురానికి బయల్దేరిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మార్చి 27న తెల్లవారుజాము సమయంలో ప్రమాదానికి గురైంది. టిప్పర్ లారీని ఢీకొట్టడంతో బస్సులో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో
బస్సులో 40 మందికి పైగా ప్రయాణికులు ఉండగా.. 14 మంది సజీవ దహనం అయ్యారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, బస్సు బయలుదేరినప్పటి నుంచే సాంకేతిక సమస్యలతో సతమతమవుతూనే
ఉంది. మార్గమధ్యలో సుమారు మూడు సార్లు బస్సు మొరాయించి ఆగిపోయింది. ఈ క్రమంలోనే డ్రైవర్ బస్సు పరిస్థితిని యజమానికి ఫోన్ ద్వారా వివరించాడు. ‘బస్సు కండిషన్ అస్సలు బాలేదు.. ప్రయాణికులు
ఇబ్బంది పడుతున్నారు.. వేరే బస్సు పంపండి’ అని కోరగా.. యజమాని బాధ్యతారాహిత్యంగా సమాధానమిచ్చాడు. ‘ఇప్పుడు వేరే బస్సు ఎక్కడి నుండి వస్తుంది? దాన్నే ఎలాగోలా లాగించుకురా’ అంటూ డ్రైవర్‌ను
ఆదేశించినట్లు విచారణలో వెల్లడైంది.యర్రగొండపాలెం వద్ద బస్సు మళ్ళీ చెడిపోవడంతో.. దాన్ని బాగు చేసేందుకు యజమాని స్వయంగా అక్కడికి చేరుకున్నాడు. అయితే, అక్కడి నుండి బస్సు స్టార్ట్ అయ్యాక లైసెన్స్
ఉన్న డ్రైవర్‌కు బదులుగా క్లీనర్ స్టీరింగ్ పట్టాడు. మార్కాపురం సమీపంలో క్లీనర్ అజాగ్రత్తగా అతివేగంగా నడపడంతో బస్సు నియంత్రణ కోల్పోయి ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 14 మంది అక్కడికక్కడే
మృతి చెందారు. ప్రమాదం జరిగిన తర్వాత ఇన్సూరెన్స్ సమస్యలు వస్తాయని భావించిన యజమాని పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. ప్రమాద సమయంలో తానే బస్సు నడిపానని అబద్ధం చెప్పాడు.
కానీ పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా బస్సు నడిపింది క్లీనర్ అని స్పష్టంగా తేలింది.పోలీసుల దర్యాప్తులో మరిన్ని సంచలన విషయాలు తెలిశాయి. సదరు యజమాని ఎనిమిది నెలల క్రితమే ఈ బస్సును
లీజుకు తీసుకున్నాడు. లైసెన్స్ ఉన్న అనుభవజ్ఞులైన డ్రైవర్లు ఎక్కువ జీతం అడుగుతారనే నెపంతో.. తక్కువ జీతానికి వచ్చే లైసెన్స్ లేని వ్యక్తులతో బస్సు నడిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రైవర్ లైసెన్స్
లేకపోవడంతో ఇప్పుడు మరో కొత్త సమస్య తలెత్తింది. ప్రమాదానికి గురైన బస్సుకు ఇన్సూరెన్స్ డబ్బులు రావని బీమా సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. నిబంధనల ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తి వాహనం నడిపి
ప్రమాదం జరిగితే క్లెయిమ్ వర్తించదు.దీంతో మృతుల కుటుంబాలు, బాధితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. యాజమాన్యం చేసిన తప్పుకు తాము బలి కావడమే కాకుండా.. కనీసం అందాల్సిన ఆర్థిక సాయం కూడా
అందకుండా పోతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకుని, ప్రత్యేక నిబంధనల కింద బాధితులకు ఇన్సూరెన్స్ డబ్బులు అందేలా చూడాలని బాధ్యులైన ట్రావెల్స్
యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.



