పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంత రావు కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ..
రెండుసార్లు ఉమ్మడి రాష్ట్రంలో తనకు ముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశం వచ్చినా తీసుకోలేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంపీ టికెట్ ఇస్తా అని చెప్పి ఇన్నాళ్లు నన్ను మోసం చేశారని భావోగ్వేగానికి గురయ్యారు. నా అనుకున్న వాళ్లే వెన్నుపోటు పొడిచారని ఎమోషనల్ అయ్యారు. అయినా నాకు పదవులు లెక్క కాదు అన్నారు. పదవుల కోసం పార్టీలు మారే వ్యక్తిని కాదని చెప్పారు. చచ్చేవరకు కాంగ్రెస్లోనే కొనసాగుతా అని ప్రకటించారు.
వీహెచ్ ఖమ్మం పార్లమెంట్ సీటు ఆశించారు. ఇందుకోసం ఇప్పటికే అధిష్టానం వద్ద అనేకసార్లు మొరపెట్టుకున్నారు. చివరికి ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురాం రెడ్డిని కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసింది. దీంతో ఆయన అసంతృప్తిని వెళ్లగక్కారు. అయితే, రామసహాయం రఘురాం రెడ్డి రెడ్డి తండ్రి సురేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచారు. ఇందిరా గాంధీ, పీవీ కుటుంబాలతో సన్నిహితంగా మెలిగారు. 1985 నుంచి రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు దీంతో ఆయనకు అధిష్టానం టికెట్ కన్ఫామ్ చేసింది.