జిల్లా ప్రజలు మన ఇసుకను సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా
జిల్లా వ్యాప్తంగా 6 ఇసుక రీచ్ లు ఏర్పాట్లు
జగిత్యాల,
జిల్లాలో భవన నిర్మాణాల, ఇతర అవసరాలకు ఇసుకను అందుబాటులోకి తీసుకురావడానికి మన ఇసుక వాహనం వెబ్ సైట్ ను ప్రారంభించుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు.
బుధవారం రోజున కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో మన ఇసుక వాహనం వెబ్ సైట్ ను కలెక్టర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు ఇసుకను అందుబాటులోకి తీసుకురావడానికి జిల్లా వ్యాప్తంగా 6 ఇసుక రీచ్ లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ధర్మపురి మండలంలోని రాజారాం, ఆరేపల్లి, కోరుట్ల మండలంలోని పైడి మడుగు, రాయికల్ మండలంలోని కుటిక్యాల, జగన్నాథ్ పూర్, మల్లాపూర్ మండలంలోని సాతారం, మెట్ పల్లి మండలంలోని ఆత్మకూర్, కథలాపూర్ మండలంలోని తక్కళ్ళపల్లి గ్రామాలలో ఇసుక రీచ్ లను ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సమగ్రంగా రూపొందించిన మన ఇసుక వాహనం వెబ్ సైట్ (https://tsmiv.cgg.gov.in ) ద్వారా పొందవచ్చని తెలిపారు. గూగుల్ లో మన ఇసుక వాహనం ఓపెన్ చేసి ఇసుకను బుకింగ్ చేసుకుంటే వారికి దూరాన్ని బట్టి చెల్లింపుల ఆధారంగా ఇసుకను సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు. మొబైల్ యాప్ ద్వారా కూడా ఇసుకను ఆర్డర్ చేసుకోవచ్చని తెలిపారు. దీని ద్వారా అక్రమ ఇసుక రవాణాను అరికట్టవచ్చని తెలిపారు. ఆన్ లైన్ ద్వారా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని తెలిపారు. ప్రజలకు అందుబాటులో వినియోగదారుని హెల్ప్ డెస్క్ నెంబర్లు 040-23120421/ 8333923732/ 9032299262 కూడా వినియోగించుకోవచ్చని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 11 జిల్లాల్లో మన ఇసుక వాహనం వెబ్ సైట్ ద్వారా ఇసుకను సరఫరా చేయడం జరుగుతున్నదని పేర్కొన్నారు. సాధారణ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే పారదర్శకంగా ఇసుక సరఫరా చేయడం జరుగుతుందని, జిల్లాలోని నిర్మాణ రంగంలో ఉన్నవారు కానీ, భవన నిర్మాణ యజమానులు, ప్రభుత్వ భవనాల నిర్మాణాల పనులను ఆన్ లైన్ ద్వారా బుకింగ్ చేసుకున్న పక్షంలో ఇసుకను సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజా ప్రతినిధుల సలహాలు, సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని జిల్లాలో అమలుపరుస్తున్నామని కలెక్టర్ తెలిపారు. రానున్న కాలంలో ఇసుక వినియోగంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. జిల్లాలోని ఇసుక రవాణాదారులు, ట్రాక్టర్ యజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని సూచించారు.కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దివాకర మాట్లాడుతూ గోదావరి నదీ పరివాహక ప్రాంతాలలోని ఇసుకను ప్రజల అవసరానికి వినియోగించుకునే విధంగా మన ఇసుక వాహనం కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగిందని అన్నారు. ప్రజలకు విస్తృతంగా అవగాహన కలిగే విధంగా ప్రచారం నిర్వహించాలని సూచించారు.
ఈ సమావేశంలో సీసీజీ డైరెక్టర్ వై.యం. గోపాల కృష్ణ, జిల్లా పరిషత్ సి.ఈ.ఓ. గౌతమ్ రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి సంపత్ రావు, జిల్లా పరిషత్ డిప్యుటి సి.ఈ.ఓ. రఘువరన్, మైనింగ్ ఏ.డి.విజయ్ కుమార్ రాథోడ్, జిల్లా పంచాయతీ అధికారి దేవరాజ్, రాయికల్, ధర్మపురి తహసిల్దార్లు, ట్రాక్టర్ అసోసియేషన్ సభ్యులు, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.