కూల్చివేతలకు కలిసొచ్చిన కాలం
The period that coincided with the demolitions
హైదరాబాద్, సెప్టెంబర్ 3, (న్యూస్ పల్స్)
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా ఏర్పాటు చేస్తే కొందరు హేళన చేశారు. మరికొందరు విమర్శలకు దిగారు. ఇది ఎంత కాలంలే అని సన్నాయి నొక్కులు నొక్కారు. బెదిరించడానికి చేస్తున్న పని అని కొందరు పనికి మాలిన మాటలు మాట్లాడారు. మరికొందరయితే విపక్షాలను అణిచి వేయడానికే హైడ్రాను రేవంత్ రెడ్డి తెచ్చారంటూ విమర్శలు చేశారు. రాజకీయంగా పెద్ద దుమారమే రేగింది. కాంగ్రెస్ పార్టీ మినహాయిస్తే హైడ్రాను అందరూ వ్యతిరేకించారు. వారి భవనాలపై హైడ్రా బుల్‌డోజర్ ఎందుకు వెళ్లదంటూ సూటిగా ప్రశ్నించారు. ఇలా ఒకటేమిటి.. ఆరంభంలో హైడ్రా పై రేవంత్ రెడ్డితో పాటు ప్రభుత్వం కూడా అనేక రకాలైన విమర్శలు ఎదుర్కొంది. నాలుగు రోజుల నుంచి… కానీ గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ అతలాకుతలమవుతుంది. అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. చివరకు విల్లాల్లోకి కూడా నీరు చేరింది. నీరు బయటకు వెళ్లే దారి లేక వరద నీరు మొత్తం నగరంపై పడింది. దీంతో నగర ప్రజలు అల్లాడి పోతున్నారు. ప్రధానంగా చెరువును ఆక్రమించి నిర్మించుకున్న ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ఇళ్లలో ఖరీదైన వస్తువులు కూడా నీటమునిగాయి. ఆర్థిక నష్టం జరిగింది. ప్రాణ నష్టం అయితే జరగలేదు కానీ కొన్ని కుటుంబాలు మాత్రం వరద నీటితో అల్లాడిపోతున్నాయి. అందుకే హైడ్రాను తీసుకు వచ్చి చెరువులను ఆక్రమించి చేసిన నిర్మాణాలను కూల్చి వేేయాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు.గత నెల రోజుల నుంచి చెరువుల పక్కనే ఉన్న నిర్మాణాలను హైడ్రా కూల్చి వేసింది. ఎఫ్‌టీఎల్ తో పాటు బఫర్ జోన్ లో ఉన్న నిర్మాణాలను తొలగించిన ప్రాంతాల్లో నీరు చెరువుల్లోకి వెళుతుంది. అక్కడ భారీ వర్షం పడినా ఆ ప్రాంత వాసులకు ఇబ్బంది కలగడం లేదు. అదే ఇప్పుడు హైదరాబాద్ లో హాట్ టాపిక్ గా మారింది. చెరువులు, కుంటలు, నాలాలను ఆక్రమించుకుని నిర్మించిన కట్టడాలను కూల్చివేయాలంటూ సోషల్ మీడియాలో పెద్దయెత్తున పోస్టింగ్ లు కనిపిస్తున్నాయి. ప్రభుత్వానికి మద్దతుగా అనేక మంది నెటిజన్లు నిలబడుతున్నారు. తాము మీ వెనక ఉన్నాం పని ముగించేయడంతూ కామెంట్స్ పెడుతున్నారు. ఇలా హైడ్రా ఏర్పాటును అందరూ స్వాగతిస్తున్నారు. భవిష్యత్ లో చెరువులను ఆక్రమించి ఇళ్లు కట్టుకుంటే కూల్చివేస్తారన్న హెచ్చరికలు బలంగా ప్రజల్లోకి పంపగలిగారు. బిల్డర్లు కూడా చెరువులను ఆక్రమించి విల్లాలు, అపార్ట్‌మెంట్ల నిర్మాణం చేపట్టి వాటిని విక్రయించారు. కొన్ని చోట్ల వెంచర్లు కూడా వేశారు. వాటిని గుడ్డిగా నమ్మి ప్రజలు కొనుగోలు చేశారు. కానీ ఇప్పుడు ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ లో తాము కొనుగోలు చేసే నిర్మాణాలున్నాయో? లేదో పరిశీలిస్తున్నారు. ఇది కదా కావాల్సింది. అయితే హైడ్రా ఏర్పాటు కేవలం హైదరాబాద్ కే కాదు. జిల్లాల నుంచి కూడా డిమాండ్ లు వినిపిస్తున్నాయి. అంటే హైడ్రా ఎంతట ిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లిందో వేరే చెప్పాల్సిన పనిలేదు