ఘాట్ కేసర్ కు మారనున్న గులాబీ మీటింగ్
The pink meeting that will move to Ghat Kesar
హైదరాబాద్, మార్చి 26, (వాయిస్ టుడే)
బీఆర్‌ఎస్ రజతోత్సవ వేడుకల్ని వరంగల్ బదులు ఘట్‌కేసర్‌లో నిర్వహించాలని ఆ పార్టీ భావిస్తోంది. తొలుత వరంగల్‌లో నిర్వహిస్తారని ప్రచారం జరగడంతో ఈ మేరకు స్థానిక బీఆర్ఎస్ నేతలు వరంగల్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న దేవన్నపేట, కడిపికొండ సమీపంలోని భట్టుపల్లి స్థలాన్ని కూడా పరిశీలిస్తున్నారు.అనూహ్యంగా పార్టీ అధినేత కేసీఆర్ సభ నిర్వహణ స్థలాన్ని మార్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మేడ్చల మల్కజ్ గిరి జిల్లా పరిధి ఘట్ కేసర్ సమీపంలో సభ నిర్వహించేందుకు నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు అక్కడి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు సభ నిర్వహణకు అనువైన స్థలాన్ని పరిశీలించాల్సిందిగా సూచించినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. సభా స్థలం మార్పుపై అధికారికంగా పార్టీ నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడనప్పటికీ.. ఘట్ కేసర్ ను ఫైనల్ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.బీఆర్ఎస్ (టీఆర్ఎస్) పార్టీ 2001 ఏప్రిల్ 27వ తేదీన ఆవిర్భవించగా.. పార్టీ ఏర్పడి 20 ఏళ్లు అవుతున్న సందర్భంగా 2021 నవంబర్ 29 దీక్ష దివస్ రోజున ‘విజయ గర్జన సభ’ పేరున భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు అప్పట్లో పార్టీ సన్నాహాలు చేసింది. ఈ మేరకు వరంగల్ నగర శివారులోని దేవన్నపేట సమీపంలో ఉన్న నిరుప్ నగర్ తండా స్థలాన్ని పరిశీలించారు. మొత్తంగా 1100 ఎకరాల్లో సభ నిర్వహించేలా ప్లాన్ వేశారు.అందులో 300 ఎకరాల్లో సభా ప్రాంగణం, నాలుగు చోట్లా 800 ఎకరాల్లో వెహికిల్ పార్కింగ్ కోసమని అంచనా వేశారు. కానీ అప్పటికే ఆ చుట్టుపక్కల మొత్తం రైతులు వరి, పత్తి, తదితర పంటలు సాగు చేసుకుంటుండగా, ఆ పొలాలన్నీ చదును చేసేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడి రైతులు తీవ్రంగా వ్యతిరేకించి, ఆందోళనలు చేపట్టారు.రోడ్డెక్కి నిరసనలు చేపట్టడంతో పాటు పొలాల వద్దే మకాం ఏర్పాటు చేసుకుని తమ భూములను చదును చేయకుండా కాపలా ఉన్నారు. అప్పటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఇలా.. ఎవరు వచ్చినా అడ్డుకుని తమ నిరసనను వెల్లగక్కారు. కాగా అప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడం, అంతలోనే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో విజయ గర్జన సభను పార్టీ వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.గతంలో విజయ గర్జన సభ రద్దు కాగా.. పార్టీ ఏర్పడి 25 ఏళ్లు అవుతున్న సందర్భంగా 2025 ఏప్రిల్ 27న నిర్వహించనున్న రజతోత్సవ సంబరాలను పార్టీ అధిష్టానం మరోసారి వరంగల్ నే ఎంచుకుంది. ఈ మేరకు కొద్ది రోజుల కిందట పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ నేతలతో సమావేశమై వరంగల్ లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశించారు. దీంతో ఆ పార్టీ నేతలు దేవన్నపేట, భట్టుపల్లి ప్రాంతాల్లోని స్థలాలను పరిశీలిస్తున్నారు.అక్కడి రైతులతో మాట్లాడి స్థలాలను వెకెట్ చేయించే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇంతలోనే పార్టీ నిర్ణయం మారినట్లు తెలుస్తోంది. పార్టీ అధినేత కేసీఆర్ రజతోత్సవ సంబరాలను హైదరాబాద్ కు అతి సమీపంలో ఉన్న మేడ్చల్ మల్కజ్ గిరి జిల్లా పరిధి ఘట్ కేసర్ లో నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు అక్కడి ఎమ్మెల్యే మల్లారెడ్డికి సమాచారం అందించినట్లు సమాచారం. సభ నిర్వహణకు స్థలం పరిశీలించాల్సిందిగా సూచించడంతో మల్లారెడ్డి ఈ మేరకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలిసింది.ఓ వైపు వరంగల్ లో సభ నిర్వహణ కోసం దేవన్నపేట సమీపంలో ప్రాంతాన్ని పరిశీలిస్తుండగా, మరో వైపు ఘట్ కేసర్ పేరు అనూహ్యంగా తెర మీదకు వచ్చింది. దీంతో సభ ఎక్కడ జరుగుతుందోననే చర్చ జరుగుతోంది. హైదరాబాద్ కు దగ్గర్లో ఉన్న ఘట్ కేసర్ లో నిర్వహిస్తారా.. లేదా గతంలో వరంగల్ విజయ గర్జన సభ క్యాన్సిల్ అయ్యింది కాబట్టి వరంగల్ లోనే నిర్వహిస్తారా అనేది హాట్ టాపిక్ గా మారింది.కాగా రెండు, మూడు చోట్ల స్థలాన్ని పరిశీలించి, ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడే సభ నిర్వహించే అవకాశం ఉంటుందని పార్టీ నాయకులు అంటున్నారు. కాగా సభ నిర్వహణ స్థలం మార్పుపై అధికారికంగా గులాబీ పార్టీ నాయకులు ఇంతవరకు స్పందించకపోవడంతో వరంగల్ లోనే సభ ఉంటుందని స్థానిక నాయకులు చెబుతున్నారు. మరి పార్టీ అధినేత సభ నిర్వహణపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.. ఏ స్థలాన్ని ఫైనల్ చేస్తారో చూడాలి.